అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు సెనేట్, కాంగ్రెస్ రెండింటిపై డెమోక్రాట్లకు నియంత్రణను కట్టబెట్టాయి. అయితే, ఈ ఫలితాలు భారత్‌కు మెరుగైన వాణిజ్య ఒప్పందాన్ని తీసుకురావడమో, రష్యాతో వాణిజ్యంపై భవిష్యత్తులో విధించే ఆంక్షల అవకాశాలను తగ్గించడమో, లేదా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న ట్రంప్ ఆర్థిక జాతీయవాదం తిరోగమించడమో చేస్తాయని చెప్పలేం. భారత విధాన రూపకర్తల ప్రకారం, దీని తక్షణ పర్యవసానాలు కాంగ్రెస్ పర్యవేక్షణ పెరగడం, రాజకీయ ఘర్షణలు, విధాన మార్పుల వేగం మందగించడం వంటివిగా ఉండవచ్చు.
“చైనాను ఎదుర్కోవడంలో భారత్ ఒక కీలక మిత్రదేశమని, ట్రంప్ ఢిల్లీపై పెత్తనం చెలాయిస్తున్నారని భావిస్తున్నందున డెమోక్రాట్లు వాణిజ్య ఒప్పందంలో మార్పులు కోరవచ్చు. అయితే, అమెరికా సంరక్షణవాద శకం ఇంకా ముగియలేదని, ఈ ఒప్పందం ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే కార్యనిర్వాహక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఉండే దశలో ఉందని గ్రహించాలి,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు) పినాక్ ఆర్ చక్రవర్తి పేర్కొన్నారు.
వాణిజ్య మంత్రిత్వ శాఖ మాజీ ప్రధాన ఆర్థికవేత్త రూపా దత్తా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. భారతదేశంతో వాణిజ్య సమస్య విషయంలో పక్షపాత ప్రయోజనాల ప్రమేయం తక్కువగానూ, జాతీయ సంరక్షణావాద విధానాల ప్రమేయం ఎక్కువగానూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. “ఒప్పందం జరుగుతుంది. కార్యనిర్వాహక, రాజకీయ అవసరాలను బట్టి కాలపరిమితి తగ్గవచ్చు లేదా పెరగవచ్చు,” అని ప్రస్తుతం చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో డిస్టింగ్విష్డ్ ఫెలోగా పనిచేస్తున్న దత్తా తెలిపారు.
అమెరికా విధానంలోని మూడు పరస్పర సంబంధిత రంగాలలో న్యూఢిల్లీకి గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయి: ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, ఇరాన్‌తో వివాదం, ప్రపంచ ఇంధన సరఫరాల స్థిరత్వం. వాషింగ్టన్లో అధికార సమతుల్యతలో మార్పు ఈ మూడింటి చుట్టూ ఉన్న రాజకీయ గతిశీలతను మార్చగలదు, కానీ భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితులను ఇది తొలగించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
డెమోక్రటిక్ కాంగ్రెస్ ఏర్పడే అవకాశం ట్రంప్ సుంకాల వ్యూహాన్ని క్లిష్టతరం చేయగలదు. కానీ భారతీయ ఎగుమతిదారులు ఉపశమనం ఆశించడానికి ఇది తక్షణ కారణాలను పెద్దగా అందించడం లేదని గత వాణిజ్య చర్చల రౌండ్లో పాల్గొన్న వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. డెమొక్రాట్లు ప్రభుత్వం సుంకాలను ఉపయోగించడంపై పరిశీలనను ముమ్మరం చేసే అవకాశం ఉంది.వాటి ఆర్థిక పరిణామాలపై మరింత పారదర్శకతను డిమాండ్ చేయవచ్చు. ఎంపిక చేసిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని కూడా కోరవచ్చు.
ప్రభుత్వ సంరక్షణావాద విధానాల వల్ల అమెరికన్ వ్యాపారాలు, వినియోగదారులపై పడిన వ్యయాలను కాంగ్రెస్ విచారణలు బహిర్గతం చేయగలవు. అయితే, ఈ నిర్ణయాన్ని వేగంగా వెనక్కి తీసుకోవడానికి ఒక ముఖ్యమైన రాజ్యాంగపరమైన, రాజకీయ అడ్డంకి ఉంది. అమెరికా అధ్యక్షుడికి వాణిజ్య విధానంపై గణనీయమైన అధికారాలు అప్పగించారు. అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటో, ఆయన సుంకాల చట్రాన్ని రద్దు చేసే శాసనపరమైన ప్రయత్నాలను అడ్డుకోగలదు.
“అందువల్ల, డెమోక్రటిక్ మెజారిటీకి ప్రత్యామ్నాయ వాణిజ్య విధానాన్ని నిర్దేశించడం కంటే, దర్యాప్తు చేయడానికి, సవాలు చేయడానికి ఎక్కువ అధికారం ఉంటుంది,” అని అధికారులు తెలిపారు. దీని అర్థం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల చర్చలలో గానీ, సుంకాలను తగ్గించే చర్చలలో గానీ త్వరగా ఒక పురోగతి సాధించే అవకాశం చాలా తక్కువగా ఉంది.
“ఈ అనిశ్చితియే ఒక ఆర్థిక వ్యయంగా మారుతోంది. పెట్టుబడులు, ఉత్పత్తి నిర్ణయాలు తీసుకోవడానికి భారతీయ ఎగుమతిదారులకు అమెరికన్ మార్కెట్లోకి ఊహించదగిన ప్రవేశం అవసరం,” అని ఢిల్లీకి చెందిన ఒక మధ్య తరహా ఇంజనీరింగ్ ఎగుమతి సంస్థ సీఈఓ సైబల్ ఘోష్ చెప్పారు. మరో ప్రధాన అనిశ్చితి ఇరాన్‌తో ఉన్న వివాదానికి సంబంధించినది. డెమోక్రటిక్‌లు అమెరికా చర్యలను నిశితంగా పరిశీలించవచ్చు, కానీ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వరకు అది జరగదు.ఈలోగా అమెరికా అధ్యక్షుడు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
“ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి, ఇరాన్‌ను ఇంకా అణచివేయాలని ట్రంప్ భావించవచ్చు. దీనివల్ల పర్షియన్ గల్ఫ్-ఎర్ర సముద్ర ప్రాంతం తిరిగి ఘర్షణలకు వేదిక కాగలదు. తద్వారా ఇంధన ధరలు పెరుగుతాయి,” అని పశ్చిమ ఆసియాలో దౌత్య పదవులలో పనిచేసిన చక్రవర్తి పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్‌తో భారతదేశానికి ఉన్న సంబంధం దాని ఇంధన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో బలంగా పాతుకుపోయింది. భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు సగం, దిగుమతి చేసుకునే ద్రవీకృత పెట్రోలియం గ్యాస్‌లో సుమారు 90 శాతం సాధారణంగా హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి.
అధిక ఇంధన ధరలు, ఇప్పటికే ఉన్న అధిక సుంకాలు కొనసాగే అవకాశంతో కలిసి, లాభాలను తగ్గించి, కొత్త ఆర్డర్లను నిరుత్సాహపరిచి, వ్యాపార విశ్వాసాన్ని దెబ్బతీయగలవు. దీని ఫలితంగా ఎగుమతి అవకాశాలు క్షీణించడం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతుంది. గత ఏడాది కాలంలో రూపాయి విలువ డాలరుకు కనిష్టంగా రూ. 88.57 నుండి ప్రస్తుతం రూ. 94.87కి పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్లేషణ ప్రకారం, రూపాయి ఒత్తిడిలోనే ఉంటుందని, సమీప భవిష్యత్తులో డాలర్‌తో పోలిస్తే 94.75-95.75 శ్రేణిలో కదలవచ్చని అంచనా వేస్తున్నారు.

More Stories
ప్రజాస్వామ్య దేవాలయంపై విరుచుకుపడిన అరాచకం
ధర్మ రక్షణకై ప్రాణాలు అర్పించిన స్వామి లక్ష్మణానంద సరస్వతి
శుద్ధి ఉద్యమ ధీరోదాత్త నాయకుడు స్వామి శ్రద్ధానంద