ఏపీలో తుపాన్ల ప్రభావంపై ప్రధాని మోదీ ఆరా 

ఆంధ్ర ప్రదేశ్ లో అర్నబ్‌, మురసు తుపాన్ల ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు తుపాన్ల తాకిడిపై వివరాలు, ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావం, ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. 

భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొంటూ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తుపాన్ సహయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 

నిరంతర అప్రమత్తతతో తుపాన్ వల్ల వచ్చిన ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారంటూ సీఎం చంద్రబాబును ప్రధాని ప్రశంసించారు. మరోవైపు అర్నబ్‌, మురసు తుపాన్లతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. రైతులకు తక్షణ సాయం అందించడంతో పాటు దెబ్బతిన్న పంటలకు పరిహారం వచ్చేలా కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

రైతుల కష్టాలు, నష్టాలపై కేంద్రానికి వరుసగా లేఖలు రాయడంతో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఇప్పటికే నాలుగుసార్లు మాట్లాడి కేంద్ర బృందాలను రాష్ట్రానికి రప్పించారు. అర్నబ్‌ తుపానుతో రాష్ట్రానికి రూ. 4,563 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదిక పంపిన ప్రభుత్వం 781 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వెల్లడించింది. మురసు తుపాన్ కారణంగా 7 జిల్లాల్లో 465 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కేంద్రానికి రాసిన మరో లేఖలో సీఎం వివరించారు. 

50,473 హెక్టార్లలో వరి పంట, 1,985 హెక్టార్లలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని, ప్రాథమికంగా రూ.343 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు. రెండు తుపాన్లతో నష్టపోయిన రైతులకు తక్షణ తాత్కాలిక సాయం ప్రకటించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. అలాగే శ్రీలంకలోని కొలంబో పోర్టులో నిలిచిపోయిన మిర్చి ఎగుమతులపైనా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. 

సుమారు 60 కోట్ల రూపాయల విలువైన సరకు నిలిచిపోవడంతో రైతులు, ఎగుమతిదారులు నష్టపోతున్నారని తెలిపారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ జోక్యం చేసుకుని ఆయా దేశాలతో సంప్రదింపులు జరిపి కంటెయినర్ల ఎగుమతికి మార్గం సుగమం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

About The Author