సైబర్‌ నేరాల ముప్పు బాధితులకు ప్రత్యేక భీమా పాలసీలు

డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాల ముప్పు కూడా అధికమవుతోంది. నకిలీ వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింకులు, నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును క్షణాల్లో కాజేస్తున్నారు. ఇలాంటి మోసాలతో ఆర్థికంగా నష్టపోయే వారికి కొంత భరోసా కల్పించేందుకు బీమా సంస్థలు ప్రత్యేక సైబర్‌ భీమా పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సైబర్‌ వాల్ట్‌ ఎడ్జ్‌, బజాజ్‌ అలయన్జ్‌ ఇండివిడ్యువల్‌ సైబర్‌ సేఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సైబర్‌ సాచెట్‌ ఇన్సూరెన్స్‌ వంటి పాలసీలు ఈ జాబితాలో ఉన్నాయి.  ఆయా సంస్థలు ప్రకటించిన వివరాల ప్రకారం పాలసీ, బీమా మొత్తాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.కోటి వరకు కవరేజీ పొందే అవకాశాలున్నాయి. 

వివిధ ఆదాయ వర్గాలకు అందుబాటులో ఉండేలా బీమా సంస్థలు పలు రకాల ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. కొన్ని పాలసీల్లో సైబర్‌ బెదిరింపులు, వైరస్‌ దాడుల వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన రక్షణ కూడా ఉండవచ్చు. అయితే అన్ని రకాల మోసాలకూ ప్రతి పాలసీలో పరిహారం లభిస్తుందనే హామీ ఉండదు. కవరేజీ, మినహాయింపులు, పరిహారం పరిమితులు, క్లెయిమ్‌ ప్రక్రియను ముందుగానే పరిశీలించడం అవసరం. కొన్ని పాలసీల్లో చట్టపరమైన ఖర్చులు, గుర్తింపు వివరాల పునరుద్ధరణకు అయ్యే వ్యయం, ఇతర అ నుబంధ ఖర్చులకు కూడా కవరేజీ ఉండవచ్చు.

ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్‌ వివరాలు తెలుసుకుని అనధికార లావాదేవీలకు పాల్పడుతున్నారు. నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్ల ఆచూకీ గుర్తించడం, పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టడం కొన్ని సందర్భాల్లో కష్టతరంగా మారుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

అయితే బీమా అనేది సైబర్‌ మోసాలను అడ్డుకునే ప్రత్యామ్నాయం కాదని, నష్టం జరిగినప్పుడు పాలసీ నిబంధనల మేరకు ఆర్థిక సహాయం అందించే సాధనమని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద లింకులను తెరవకపోవడం, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ వెల్లడించకపోవడం, అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లనే వినియోగించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.  సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి. బీమా పాలసీ ఉన్నవారు కూడా క్లెయిమ్‌ నిబంధనల ప్రకారం వెంటనే బీమా సంస్థకు సమాచారం అందించాలి.

About The Author