త్వరలో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ

త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో  ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ పేరిట బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో ఆయన ఉత్సాహంగా పాల్గొంటూ  లంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేద్దామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ఇక్కడి అరాచకశక్తులను తుదముట్టిద్దామని చెప్పారు.

నిజాం కాలేజీ నుంచి ప్రారంభమైన ర్యాలీ మొజాంజాహీ మార్కెట్‌ వరకు సాగింది. కిలోమీటరున్నర దూరం పాదయాత్రలో అమిత్‌ షా ఉత్సాహంగా పాల్గొన్నారు. అడుగడుగునా కార్యకర్తలకు వందనం చేస్తూ, వారిని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. ఈ యాత్రలో అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌ రావు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మొజాంజాహీ మార్కెట్‌ వద్ద బీజేపీ బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ సర్కారు రావాలా? వద్దా? అని కార్యకర్తలను అడిగారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారును గద్దె దించేందుకు సంకల్పం తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అరాచకత్వాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. నిజాం మెడలను సర్దార్‌ పటేల్‌ వంచబట్టే హైదరాబాద్‌ విముక్తి పొందిందని గుర్తుచేశారు.

ఎస్‌ఐఆర్‌, ఈవీఎంపై చర్చకు సిద్ధమని, హైదరాబాద్‌ నుంచి సవాల్‌ విసురుతున్నానని ప్రకటించారు.  ఈవీఎంల ద్వారా తాము గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ ఎలా గెలిచేదని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బచావో ర్యాలీలపై అమిత్‌ షా విమర్శలు గుప్పిస్తూ  తెలంగాణలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే తనతోపాటే నినాదాలు చేయాలని ఆయన ప్రజలను కోరారు.

ఢిల్లీలో ఆ పార్టీ నిర్వహించింది ఓట్‌ బచావో ర్యాలీ కాదని, అది చొరబాటుదారులను కాపాడే ప్రయత్నమని ఆయన విమర్శించారు. ‘రాహుల్‌ గాంధీ కూడా ఒక చొరబాటుదారుడు. కాంగ్రెస్‌. చొరబాటుదారులను ఓటుబ్యాంక్‌గా చూస్తోంది. చొరబాటదారుల ఓట్లు తొలగించొద్దా? ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే తొలగించాలా? వద్దా?’అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్‌కు కడుపుమండుతోందని ధ్వజమెత్తారు.

సర్‌ ప్రక్రియను ఆపాలని కాంగ్రెస్‌ అండ్‌ కంపెనీ కుట్ర చేస్తోందని, 13 కోట్ల ఓట్లు తొలగించారని రాహుల్‌ అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ‘సర్ జరగకముందూ అనేక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సర్ కారణంగానే మేం అధికారంలోకి వచ్చామని రాహుల్ అంటున్నారు. మరి రాహుల్‌ ఎంపీ అయింది కూడా సర్ వల్లేనా’ అంటూ కేంద్ర హోంమంత్రి చురకలంటించారు. 

జీవితంలో రాహుల్‌ ప్రధాని కాలేరని, మాక్‌ పార్లమెంట్‌లో ప్రధాని సీట్‌లో కూర్చొని సంబరపడాల్సిందేనని ఎద్దేవా చేశారు. తాము సర్‌పై చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. ఈవీఎంలతోనే కేంద్రంలో బీజేపీ గెలిచిందనుకుంటే, తెలంగాణలో రేవంత్‌ ఎలా గెలిచారని అమిత్‌ షా ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి ఎంత ప్రయత్నించినా చొరబాటుదారులకు ఓటు దక్కనివ్వబోమని నొక్కి చెప్పారు.

‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉంది. అలాంటి పార్టీ మోదీని అడ్డుకుంటుందా? కాంగ్రెస్‌ను రాహుల్‌ గాంధీ కాపాడలేరు’అని పేర్కొన్నారు.  వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్‌ మోదీతో పరుగుపందెంలో పాల్గొనగలదా?. అంటూ ఎద్దేవా చేశారు.‘తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రేవంత్‌ టూ రాహుల్‌ ట్యాక్స్‌. రాహుల్‌కు రేవంత్‌ కప్పం కడుతున్నారు’ అని అమిత్ షా ఆరోపించారు. 

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నచోట్ల అవినీతి రాజ్యమేలుతోందని పేర్కొంటూ తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఏటీఎంగా రేవంత్‌రెడ్డి మార్చారని,  ఇక్కడ రాహుల్‌, రేవంత్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ఇక్కడి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ ఎక్కడికి వెళ్తోంది? రాహుల్‌ కోసమే ఇక్కడ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  కాంగ్రెస్‌ అవినీతిని ఒవైసీ ఆపుతారా బీఆర్‌ఎస్‌ ఆపుతుందా? అని ప్రశ్నిస్తూ  కాంగ్రెస్‌ అవినీతిని కేవలం బీజేపీ మాత్రమే ఆపగలదని స్పష్టం చేశారు. 

తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారనే ఆరోపణల్లో వాస్తవం లేదని, దేశంలో లేని వారి ఓట్లే 3 కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. చొరబాటుదారులను భారత్‌ నుంచి పారద్రోలుతామని స్పష్టం చేశారు.

About The Author