పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాను తీవ్రంగా మారింది. ప్రస్తుతం చెన్నైకి 260 కిమీ, నెల్లూరుకు 290 కిమీ, మచిలీపట్నానికి 320 కి.మీ., కావలికి 310 కి.మీ., ఒంగోలుకు 330 కి.మీ.,విశాఖపట్నానికి 470 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము సమయంలో నెల్లూరు నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కి.మీ వేగంతో, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నవంబర్ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండనున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 20 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వీటిలో ఏలూరు జిల్లాలో తొమ్మిది మండలాలు, కృష్ణా జిల్లాలో ఐదు, ఎన్టీఆర్ జిల్లాలో ఐదు, బాపట్ల జిల్లాలో ఒక మండలం ఉన్నది. ముందస్తు జాగ్రత్తగా సహాయక చర్యల కోసం 6 ఎన్డీఆర్ఎఫ్, 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 4వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముందుగానే కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు హెచ్చరికను జారీ చేశారు. మురాసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది, యంత్రాలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం సిబ్బంది, యంత్రాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి విజయ్ సానుకూలంగా స్పందించినట్టు ఏపీ సీఎంవో వెల్లడించింది.
తుఫాన్ వల్ల ఏదైనా సమస్య ఎదురైతే ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌ను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా అధికారులకు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరారు.
తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

More Stories
రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాదిపై పోలీసుల కాల్పులు
ఏపీ వైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్
కక్ష్యలోకి మూడో స్వదేశీ అణు గడియారం