రామ్‌లీలా మైదానంలో 10 లక్షల మంది ఎక్కడ రాహుల్!.. బీజేపీ

 

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి సభకు 10 లక్షల మంది హాజరవుతారని చేసిన వాదనను బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సంబిత్ పాత్ర ప్రశ్నించారు. సభా ప్రాంగణంలో గణనీయమైన భాగం ఖాళీగా ఉందని పేర్కొన్న ఆయన, ఈ కార్యక్రమం “పూర్తిగా సమయం వృథా” అని విమర్శించారు. మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటల మధ్య, అక్కడ ఏర్పాటు చేసిన 28,000 కుర్చీలలో సుమారు 5,000 నుండి 7,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయని పాత్ర పేర్కొన్నారు.

 
రామ్‌లీలా మైదాన్‌లో 40 శాతం స్థలం ఖాళీగా ఉందని ఆరోపించిన ఆయన, 10 లక్షల మంది హాజరయ్యారన్న కాంగ్రెస్ వాదనను తప్పుబట్టారు.  మీరు వెనుక చూస్తే, రామ్‌లీలా మైదాన్‌లో 40 శాతం స్థలం ఖాళీగా ఉండటం కనిపిస్తుందని చెప్పారు.  అనేక పార్టీలను, వాటి మద్దతుదారులను ఏకం చేసినప్పటికీ, ప్రతిపక్షాలు తాము చెప్పిన సంఖ్యలో ప్రజలను సమీకరించలేకపోయాయని ఆయన విమర్శించారు. 
 
“ఆ 10 లక్షల మంది ఎక్కడ ఉన్నారు? మాకు చూపించండి. ఇలాంటి జిమ్మిక్కులతో ఎవరూ నాయకులుగా లేదా ప్రధానమంత్రిగా కాలేరు. ‘పీఎం’ అంటే కేవలం ‘ప్రైమ్ మినిస్టర్’ మాత్రమే కాదు; ఇందులో ‘పి’ అంటే ‘పసీనా’ (చెమట), ‘ఎం’ అంటే ‘మెహనత్’ (కఠిన శ్రమ). ఒక ప్రధానమంత్రి చెమట. కఠిన శ్రమతో తయారవుతారు. అన్ని పార్టీలను, జెండాలను ఒకచోట చేర్చినా, వారు 10 లక్షల మందిని సమీకరించలేకపోయారు” అని పాత్ర ఎద్దేవా చేశారు. 
 
2024 లోక్‌సభ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పాత్ర మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా లేరని, ఆయన 2025లో ఆ పదవిని చేపట్టారని గుర్తు చేశారు. ఒకవేళ 2024 ఎన్నికలు అక్రమమే అయితే, అప్పుడు ఎన్నికైన ఎంపీల హోదా, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ హోదా కూడా అక్రమమే అవుతుందని ఆయన వాదించారు. 
 
ఎన్నికలు జరిగిన రెండున్నర ఏళ్ల తర్వాత, వాటిని అక్రమమని ప్రకటించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. “2024 ఎన్నికలను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లేదా ‘ఇండియా’ కూటమికి చెందిన ఏ పార్టీ అయినా దాఖలు చేసిన ఒక్క పిటిషన్‌నైనా చూపించండి? రామ్‌లీలా మైదానంలో నిలబడి, రెండున్నర ఏళ్ల తర్వాత ఎన్నికలు అక్రమమని ప్రకటించడం కుదరదు” అని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇంకా పాత్ర మాట్లాడుతూ, తాము ఉదయం నుండి ఈ ర్యాలీని గమనిస్తున్నామని, రాహుల్ గాంధీ ప్రసంగాన్ని విన్నామని, అయితే ఇది “పూర్తిగా సమయం వృథా” అని భావిస్తున్నామని చెప్పారు.
 
మైదానంలో సగం ఖాళీగానే ఉంది 
 
ఇదిలా ఉండగా, ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో 10 లక్షల మంది వస్తారని, దేశవ్యాప్తంగా ప్రజలను తీసుకువస్తామని ప్రకటించినప్పటికీ, ఆ ప్రాంగణంలో సగం ఖాళీగానే ఉందని  కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  ఆరోపించారు. “నిజం బయటపడింది. 20 పార్టీల ద్వారా డబ్బులిచ్చి, 10 లక్షల మంది వస్తారని ప్రకటించినప్పటికీ, రామ్‌లీలా మైదాన్‌లో సగం ఖాళీగానే ఉంది. రామ్‌లీలా మైదాన్ సామర్థ్యం కేవలం 50,000 మాత్రమే,” అని ఆయన పేర్కొన్నారు. 
 
రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, “ఇలాంటి పరిస్థితుల్లో, రాహుల్ గాంధీ జీ, మీ ‘అర్బన్ నక్సల్’ ఎత్తుగడ బట్టబయలవుతోంది,” అని ఆయన ధ్వజమెత్తారు. భారత యువత జాతీయవాదంతో నిండి ఉందని, ప్రజలు “దొంగలకు” ఓటు వేయడం మానేశామని చెబుతుండగా, రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలు చేస్తున్నారని సింగ్ ఆరోపించారు. “భారత యువత జాతీయవాదంతో నిండి ఉంది… మీరు ఓట్ల దొంగతనం ఆరోపిస్తుంటే, ప్రజలు దొంగలకు ఓటు వేయడం మానేశామని చెబుతున్నారు,” అని సింగ్ జోడించారు.

About The Author