అండాల అక్రమ సేకరణలో 49 బాధిత మహిళల గుర్తింపు

* ఒక్కో అండానికి రూ.50 వేలు.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ

తెలంగాణాలో కలకలం రేపిన మహిళల అండాల అక్రమ సేకరణ, విక్రయాల వ్యవహారంలో ఇప్పటివరకు 49 మంది బాధిత మహిళలను గుర్తించినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారికి డబ్బు ఆశచూపి అండాల సేకరణకు పాల్పడిన ముఠా కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ అక్రమ వ్యవహారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు, స్థానిక దళారులు, ఐవీఎఫ్‌ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దందాలో ఇండోర్‌కు చెందిన అమిత్‌ శర్మను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బేగంపేటకు చెందిన నిఖత్‌ పర్వీన్‌ మహిళలను గుర్తించి, ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చే బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. రెజిమెంటల్‌ బజార్‌కు చెందిన రేష్మా ఖతూన్‌ ఐవీఎఫ్‌ ఏజెంట్‌గా వ్యవహరించినట్లు సీపీ సుమతి తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా కార్యకలాపాలు సాగించినట్లు వెల్లడించారు. 

వివిధ ప్రాంతాల నుంచి మహిళలను నగరానికి తీసుకొచ్చి, వారికి ఆశ్రయం కల్పించేందుకు ఉమెన్స్‌ హాస్టళ్ల పేరుతో మూడు వేర్వేరు భవనాలను ఉపయోగించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. మహిళలకు ఒక్కో అండానికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తామని ఆశ చూపి ఒప్పందాలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వైద్యుల పర్యవేక్షణ, అవసరమైన అనుమతులు, నిబంధనలను పాటించకుండా హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చాయి. 
 
అనంతరం మహిళలను సుమారు పది రోజుల పాటు ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఉంచి అండాలను సేకరించేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రక్రియలో మహిళల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? వారికి సరైన వైద్య సమాచారం, సమ్మతి తీసుకున్నారా? అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మధ్యవర్తులు నగరంలోని వివిధ ఐవీఎఫ్‌ కేంద్రాలతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఈ వ్యవహారాన్ని నిర్వహించినట్లు సీపీ వెల్లడించారు. 
 
అయితే ఏయే కేంద్రాలకు అండాలు సరఫరా చేశారు? ఈ అక్రమ కార్యకలాపాల్లో మరెంతమంది పాల్గొన్నారు? బాధిత మహిళలకు నిజంగా ఎంత మొత్తం చెల్లించారు? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. గుర్తించిన 49 మంది మహిళల నుంచి మరిన్ని వివరాలు సేకరించడంతో పాటు, నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్‌ సంభాషణలు, ఇతర సంబంధాలను పరిశీలిస్తున్నామని వివరించారు. 

About The Author