భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతాననడం చాతకానితనమే

భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపేస్తే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సరిపోతాయని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు.

ఓటు చోరీ జరిగి ఉంటె తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించకూడదా? అని ఆమె ప్రశ్నించారు. దేశంలో అరాచకం సృష్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశ విచ్ఛిన్నకర శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

కొడంగల్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. స్థానికుడు కాకపోయినా రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు గెలిపించారని అనే గుర్తుచేశారు. అయితే నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆమె విమర్శించారు. బాధితులకు వెంటనే పరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఆమె కోరారు.

గత రెండేళ్లలో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు కేటాయించినట్లు ఎంపీ వివరించారు. అమృత్ పథకం కింద రూ.2.22 కోట్లు, ఎంపీ నిధుల నుంచి రూ.1.45 కోట్లతో రోడ్లు, కమ్యూనిటీ హాల్, హైమాస్ట్ లైట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. పీఎం శ్రీ పథకం కింద రూ.79.50 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.69.75 లక్షలు, వీబీ-జీ రామ్ జీ కింద రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు అరుణ వెల్లడించారు.

పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని డీకే అరుణ కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి అప్రోచ్‌ను నార్లాపూర్‌కు మార్చడం ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాంతానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న జూరాల నీటి అప్రోచ్‌తోనే పనులు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

About The Author