పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ధూరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పోటీ చేయనున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ తర్వాత 40 మంది జాబితాను వెల్లడించారు. మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న మంత్రి సంజీవ్ అరోరాను కూడా అభ్యర్థిగా ప్రకటించారు. లుథియానా వెస్ట్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఉన్న బోన్‌దిసీ జైలులో ఆయన ఉన్నారు. సుమారు రూ. 100 కోట్ల మేర జీఎస్టీ లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఊరట కల్పించాలని కోరుతూ సంజీవ్ ఆరోరా పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను 15 రోజుల క్రితమే పంజాబ్ కోర్టు తిరస్కరించింది. 2026 మే 9వ తేదీన అరోరాను ఈడీ అరెస్టు చేసింది.
అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ కొట్కాపురా నుంచి పోటీ చేయనున్నారు. మొదటి జాబితాలో పేర్కొన్న ఇతర ప్రముఖ అభ్యర్థులలో అజ్నాలా నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, తల్వండి సాబో నుంచి బల్జిందర్ కౌర్, బటాలా నుంచి అమన్‌షేర్ సింగ్ షెరీ కాల్సీ, భదౌర్ నుంచి లాభ్ సింగ్ ఉగోకే ఉన్నారు. అభ్యర్థుల జాబితాను ముందుగానే విడుదల చేయడం, పార్టీ తన పనితీరుపై కలిగి ఉన్న నమ్మకానికి నిదర్శనమని ముఖ్యమంత్రి మాన్ పేర్కొన్నారు.

More Stories
యూపీ ఓటర్ల జాబితాలో 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతు
మీ అసంతృప్తిని గోమతీ నదిలో పారేయండి
మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు దేశవ్యాప్తంగా గందరగోళం!