పరస్పర అంగీకారంతో కొనసాగిన శారీరక సంబంధాన్ని విఫలమైందనే కారణంతో అత్యాచారంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సమ్మతితో ఏర్పడిన శారీరక సాన్నిహిత్యాన్ని బంధం వికటించిన తర్వాత లైంగిక దాడిగా పేర్కొనలేమని, దానిని నేరంగా మార్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ మేరకు కేరళకు చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తిపై నమోదైన అత్యాచారం, మోసం కేసులను కొట్టివేస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మొదటి నుంచే ఉద్దేశపూర్వకంగా మోసం చేసి, నమ్మించి శారీరక బంధానికి సమ్మతి పొందిన సందర్భాలను ఇలాంటి కేసులతో పోల్చిచూడొద్దని తేల్చిచెప్పింది.
‘‘ఒక బంధం కొనసాగుతున్న సమయంలో పరస్పర సమ్మతితో ఏర్పడిన శారీరక సంబంధం ఆ తర్వాత సంబంధం చెడిపోయిందనే ఒకే ఒక్క కారణంతో దానిని అత్యాచారంగా పరిగణించలేం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘‘గతంలో జరిగిన ఘటనల పట్ల తర్వాత కలిగే పశ్చాత్తాపం లేదా బాధ, సమ్మతితో కూడిన బంధాన్ని నేరంగా భావించలేం..దాని ఆధారంగా న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను, గౌరవాన్ని హరించడం సరికాదు.’’ అని వ్యాఖ్యానించింది.
‘‘బంధం విఫలమైన ప్రతిసారీ రేప్ కేసు నమోదు చేస్తే, అది పురుషుల స్వేచ్ఛను పూర్తిగా హరించినట్లవుతుంది. ఒకప్పుడు సమ్మతితో ఉన్నంత మాత్రాన, రేప్ కేసు భయంతో ఆ బంధంలోనే ఉండిపోవాలా? బంధం నుంచి బయటకు వచ్చే హక్కు పురుషుడికి ఉండదా? ఆ నిర్ణయాన్ని మోసం అనలేం.. ’’ అని ధర్మాసనం తెలిపింది. బలవంతం, లైంగిక హింస, మోసపూరితంగా సమ్మతిని పొందడం వంటివి ఉంటే నేరంగా పరిగణించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
సంబంధాలు విఫలమైన ప్రతిసారీ క్రిమినల్ కేసులు నమోదు చేయడం వల్ల అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. విఫలమైన ప్రేమ లేదా భాగస్వామ్య బంధాలను క్రిమినల్ చర్యలుగా మార్చే ధోరణి పెరుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.
వివాహమై భార్య ఉన్న విషయం దాచిపెట్టి, మోసపూరితంగా సంతోష్ కుమార్ తనను మైసూర్లో పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ ఆరోపించింది. 1996 నుంచి 2003 వరకు తమ మధ్య శారీరక సంబంధం కొనసాగిందని, ఆయన తనను మోసం చేశారని, విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
తనపై ఉన్న అత్యాచారం, మోసం కేసులను కొట్టివేయాలని సంతోష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

More Stories
జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన
ఎల్నినో కారణంగా రాబోయే నెలల్లో 3.73 లక్షల మరణాలు
భూటాన్లో హిమానీనదం విస్ఫోటనం