దేశంలో ఎల్నినో కారణంగా పెరుగుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలు రాబోయే నెలల్లో ప్రాణనష్టాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధన ఆధారిత అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ రూపొందించిన న్యూ ట్రాకర్ ప్రకారం 2026 అక్టోబర్ నుంచి 2027 మార్చి నాటికి భారత్లో అధిక వేడి కారణంగా సాధారణస్థాయికి మించి సుమారుగా 55 వేల మరణాలు సంభవించే అవకాశం ఉన్నది.
ఆ మరణాల్లో ఎక్కువ భాగం మార్చి నెలలోనే నమోదయ్యే ప్రమాదం ఉందని న్యూ ట్రాకర్ అంచనా వేసింది. ఇది వాతావరణ సమాచారం, ఉష్ణోగ్రతల అంచనాలు, గతంలో అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించిన మరణాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రూపొందించిన నమూనా అంచనా మాత్రమే. వాస్తవంగా ఎంతమంది మరణిస్తారో ఈ అంచనా కచ్చితంగా వెల్లడించడం లేదు.
కాగా, ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంవల్ల సంభవించే ఓ పరిణామం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఈ ఏడాది ఎల్నినో బలంగా ఉందని, డిసెంబర్లో గరిష్ఠస్థాయికి చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావాలు 2027 ప్రారంభం వరకు కొనసాగవచ్చని అంచనా వేసింది. న్యూ ట్రాకర్ అంచనాల ప్రకారం అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రపంచ వ్యాప్తంగా అధిక వేడి కారణంగా సాధారణ స్థాయికి మించి సుమారు 3.73 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉంది.
ఈ ఆరు నెలల కాలంలో నైజీరియాలో 56 వేల మరణాలు, భారత్లో 55 వేల మరణాలు సంభవించవచ్చని అంచనా. ఇండోనేషియాలో 29 వేలు, బ్రెజిల్లో 19 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని న్యూ ట్రాకర్ పేర్కొన్నది. అయితే ఈ న్యూ ట్రాకర్ అంచనాలు మరణాలు తప్పనిసరిగా సంభవిస్తాయని చెప్పడంలేదు. ముందస్తు హెచ్చరికలు, తాగునీటి సదుపాయాలు, చల్లదనం కల్పించే కేంద్రాలు, బయట పనిచేసే కార్మికులకు రక్షణ, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా ఈ ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

More Stories
జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన
శారీరక సంబంధం విఫలమైతే అత్యాచారంగా పరిగణించలేం
భూటాన్లో హిమానీనదం విస్ఫోటనం