కేసీఆర్ అవినీతిని వాయిదాలుగా బైట పెడతాం 

కేసీఆర్ అవినీతిని వాయిదాలుగా బైట పెడతాం 

సీఎం కేసీఆర్ చేసిన అవినీతిని వాయిదాల వారీగా బయట పెడతామని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో సాధారణ పరిపాలన ఆగిపోయిందని  ఎన్నికలు మాత్రమే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. సంక్షేమం పక్కనబెట్టి పార్టీ గెలుపే ముఖ్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జమీన్ జఫ్త్ అయిందని, ఆ పార్టీకి డ్రైవర్ లేడు, స్టీరింగ్ లేదని ఎద్దేవా చేశారు. ధరణి అనేది తుగ్లక్ ధరణి అని చెబుతూ  కేసీఆర్ అనుకున్న దానికి ఇప్పుడు వ్యతిరేకంగా అవుతోందని విమర్శించారు.  ఓవైసీ, కేసీఆర్ చీకటి ఒప్పందాలను బీజేపీ బయటకు తీసుకొస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్, ఓవైసీలను రాజకీయ నిరుద్యోగులను చేయాలని పిలుపిచ్చారు. తెలంగాణకు చార్మినార్ బాశింగం కాదని,  మన తెలంగాణకు బాశింగము వరంగల్ తోరణం అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కాబట్టి ప్రధాన మంత్రిని కేసీఆర్ కలిశాడని చెబుతూ తమకు ప్రభుత్వం వేరు, పార్టీ వేరని తెలిపారు. కుటుంబ రాజకీయాల పార్టీ టీఆర్ఎస్. బీజేపీ కార్యకర్తల పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. పాలన పక్కనబెట్టి ఎన్నికలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని విమర్శించారు. 

టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నికల జిమ్మిక్కులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం ఇస్తామని ఇప్పటికీ ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు. వరంగల్‌లో ప్రజలు వర్షాలతో నష్టపోయినా వారికి రూ.10వేలు ఇవ్వలేదని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్‌‌ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రేవేట్ స్కూల్ నడ్డి విడుస్తున్నదని మురళీధరరావు ధ్వజమెత్తారు. ఈ రంగంపై దాదాపుగా 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారని చెబుతూ కరోనాతో ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తున్న 6 లక్షలమంది రోడ్డునపడ్డారని దుయ్యబాట్టారు.

ప్రైవేట్ పాఠశాలపై పరోక్షంగా ఆధారపడిన వారికి ఉపాధి పోయిందన్నారు.ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకుంటున్నారని, అమ్మ ఒడి పేరుతో తల్లిదండ్రులకు ఫీజు రీయింబర్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలు, టీచర్స్, యజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ఒక్కరోజు కూడా వారిని పిలిచి మాట్లాడలేదని విచారం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌‌లో అమ్మఒడి ద్వారా విద్యా రంగాన్ని ప్రోత్సాహిస్తున్నారని గుర్తు చేశారు.