బిఆర్ఎస్ లో ప్రవేశం కోసమేనా కేటీఆర్ కు ఇప్పుడు కొండా సురేఖ` విచారం’!

 
మంత్రి పదవి కోల్పోయిన తర్వాత చాలా కాలం నిశ్శబ్దంగా ఉన్న కొండా సురేఖ తాజా ట్వీట్‌లో రెండేళ్ల క్రితం ఓ హీరోయిన్, కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని పేర్కొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నది. దీంతో ఆమె చూపు మళ్లీ గులాబీ వైపు మళ్లిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  గతంలో కూడా కొండా సురేఖ రాజకీయ ప్రయాణం అంతా దిక్కార స్వరంతోనే సాగింది. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరి వరంగల్ తూర్పు నుంచి గెలిచారు. 
 
కానీ మంత్రి పదవి రాకపోవడంతో 2018లో కాంగ్రెస్‌లోకి మారారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి పదవి కోల్పోయిన తర్వాత మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ భర్త కొండా మురళీ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి పోయిన వెంటనే కొన్ని గంటల్లోనే కేసీఆర్‌ను మంచివారని, హుందాగా వ్యవహరిస్తారని ప్రశంసించడం కూడా అప్పట్లో వారి చూపు బీఆర్ఎస్ వైపు ఉన్నట్టు చర్చ జరిగింది.
 
అయితే గతంలో కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేయటం ఆమెకు మైనస్ అయ్యిందని సమాచారం. ఈ క్రమంలో గతంలో కేటీఆర్ మీద కామెంట్స్ చేసి కేసులు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ఫీల్ అవ్వటం, అదీ బాహాటంగా సోషల్ మీడియా ద్వారా చెప్పటం దీంతో బీఆర్ఎస్‌లోకి తిరిగి చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది.  కేటీఆర్‌పై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

“బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే దురుద్దేశం గానీ నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను” అంటూ ఎక్స్ లో ఆమె తెలిపారు. 

హరీశ్‌రావు వంటి నేతల ద్వారా సంప్రదింపులు సాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ స్వాగతిస్తారా అన్న సందేహం కూడా ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఈ చర్చకు మరింత ఊపు ఇస్తున్నాయి. 66 డివిజన్లున్న గ్రేటర్ వరంగల్‌లో 25 డివిజన్లు వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి.  

About The Author