ఖరీఫ్‌లో పంట నష్టపోయిన సుమారు 13 లక్షల ఎకరాలకు గాను ఎకరానికి రూ.30,000 చొప్పున ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య డిమాండ్ చేశారు. కరువు తీవ్రత ఉన్న 365 మండలాల్లో రైతుల సంక్షేమం, సహాయక చర్యల కోసం మండలానికి రూ.10 కోట్ల చొప్పున తక్షణమే నిధులు మంజూరు చేసి విడుదల చేయాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల బ్యాంకు రుణాల రికవరీని తక్షణమే నిలిపివేసి, రుణాలను రీషెడ్యూల్ చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్లకుండా పటిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద 125 పనిదినాలు కల్పించి, తెలంగాణలో 8,83,845 పనుల కోసం తన 60 శాతం వాటాగా రూ.3,825 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను జమ చేసి వ్యవసాయ కూలీలను, కౌలు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సస్యశ్యామలంగా పాడిపంటలతో విలసిల్లిన తెలంగాణలో కాంగ్రెస్ పాలకుల అనాలోచిత నిర్ణయాలు, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే నేడు కరువు తాండవిస్తోందని లక్ష్మీనర్సయ్యమండిపడ్డారు. ఎల్ నినో హెచ్చరికలు గత ఫిబ్రవరి నుంచే కేంద్ర ప్రభుత్వంతో పాటు శాస్త్రవేత్తలు జారీ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ లభ్యతను గానీ, రిజర్వాయర్లలో నీటి నిల్వలను గానీ సమన్వయం చేసుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిందని, ఇప్పుడు ఆ వైఫల్యాన్ని ఎల్ నినో మాటున కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డుల కోసం కేవలం 365 మండలాల్లోనే కరువు ఉన్నట్లు జీవో ఇచ్చి చేతులు దులుపుకుందని, వాస్తవానికి రాష్ట్రంలో 90 శాతానికి పైగా మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో సరైన విద్యుత్, సాగునీరు అందించకపోవడం వల్లనే దాదాపు 18 శాతం విస్తీర్ణంలో సుమారు 13 లక్షల ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుత రబీ సీజన్లో రైతులపై ఒత్తిడి తెస్తూ, విత్తన కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంట ఎండినా, నష్టం వచ్చినా ప్రభుత్వానికి సంబంధం లేదని బాండ్ పేపర్లు రాయించుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే బాధ్యతల నుంచి తప్పుకుంటూ వారిని నట్టేట ముంచాలని చూస్తోందని, వరి వద్దంటున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు.
More Stories
నేడు కూడా తెలంగాణాలో రజాకార్ల చేతుల్లోనే అధికారం
డంప్ యార్డు, పారిశ్రామిక వ్యర్థాలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి
వివాహితపై మయన్మార్ పౌరుల సామూహిక లైంగిక దాడి