జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన స్మృతి మంధాన సేన వన్డే సిరీస్‌నూ అదే ఆధిపత్యంతో ముగించింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్‌లో ప్రత్యర్థిని 131 పరుగులకే కట్టడి చేసిన భారత అమ్మాయిలు లక్ష్యాన్ని కేవలం 17 ఓవర్లలోనే ఛేదించారు. టాస్ తర్వాత తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఆరంభం నుంచే చుక్కలు చూపించారు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్ పూర్తయ్యేసరికి జింబాబ్వే 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం 25 పరుగుల వద్ద మూడో వికెట్ కూడా పడటంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. వికెట్‌కీపర్ బ్యాటర్ మోడెస్టర్ ముపాచిక్వా మాత్రం పట్టుదలగా ఆడింది. 48 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసింది. కెప్టెన్ జోసెఫిన్ న్కోమో 67 బంతుల్లో 35 పరుగులు చేయగా చిడ్జా ధురురు 39 బంతుల్లో 20 పరుగులతో కొంతసేపు పోరాడింది. అయినప్పటికీ భారత బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోరు సాధించలేకపోయారు.
జింబాబ్వే 52 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోగా భారత బౌలర్లు ఒత్తిడి కొనసాగించారు. 95 పరుగుల వద్ద ఐదో వికెట్ పడగా, ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజారాయి. దీంతో జింబాబ్వే 39.5 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలింగ్‌లో వైష్ణవి శర్మ 10 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో వైష్ణవి శర్మకు ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. క్రాంతి గౌడ్ 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, సయాలి సత్ఘరే 11 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టింది.
కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జింబాబ్వేను స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో ఈ ముగ్గురి పాత్ర కీలకంగా నిలిచింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. యాస్తికా భాటియా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగింది. అయినా ప్రతికా రావల్, హర్లీన్ డియోల్ జాగ్రత్తగా ఆడుతూ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 59 పరుగులు జోడించారు. హర్లీన్ 19 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసి ఔటైనా, ప్రతికా తన దూకుడును కొనసాగించింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షఫాలీ వర్మ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. ప్రతికాతో కలిసి జింబాబ్వేకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 74 పరుగులు జోడించి భారత్‌కు విజయాన్ని అందించారు. షఫాలీ కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసింది. వన్డేల్లో భారత మహిళల తరఫున రెండో వేగవంతమైన అర్ధసెంచరీని నమోదు చేసింది.
ప్రతికా రావల్ 56 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 59 పరుగులు సాధించింది. ఇద్దరూ కలిసి తలో 73 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదడం మ్యాచ్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ ఈ వన్డే మ్యాచ్‌ను టీ20 పోరుగా మార్చేసింది. కేవలం 17 ఓవర్లలోనే 133 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి 3-0తో క్లీన్ స్వీస్ చేసింది. ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుత ప్రదర్శన చేసిన వైష్ణవి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ మొత్తం నిలకడగా రాణించిన ప్రతికా రావల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచింది.

More Stories
ఏపీ పై అర్నబ్ పంజా.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అతలాకుతలం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీట్లు ఎన్ని గెలిచిందో ఊహించండి?
రూ. 7,395 కోట్ల వ్యయంతో ‘పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన’