సైబర్‌ దాడులతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు

దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు సైబర్‌ దాడులు కూడా ముప్పుగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న సైబర్‌ ముప్పులను ఎదుర్కొనేందుకు ఆధునిక మౌలిక సదుపాయాలు, పటిష్టమైన కంప్యూటింగ్‌ వ్యవస్థలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని పేర్కొన్నారు. సైబర్‌ నేరగాళ్లు, సైబర్‌ ఉగ్రవాదుల నుంచి భారత బ్యాంకింగ్‌ వ్యవస్థను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. 

ఆదివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రూ 169 కోట్లతో ఏర్పాటు చేసిన డేటా సెంటర్‌, సైబర్‌ సెక్యూరిటీ శిక్షణా సంస్థలను ప్రారంభిస్తూ భారత్‌ ఆర్థికంగా బలపడుతున్న కొద్దీ బ్యాంకింగ్‌ వ్యవస్థ భద్రతకు ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. పాతబడిన వ్యవస్థలు, శిక్షణా పద్ధతులు, సాధనాలతో కొత్త సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. 

సైబర్‌ దాడుల నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆర్‌బీఐ డేటా సెంటర్‌, సైబర్‌ సెక్యూరిటీ శిక్షణా సంస్థ దేశ బ్యాంకింగ్‌ మౌలిక సదుపాయాల భద్రతను, సంక్షోభాలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికి చేరేలా పాలన సాగాలని తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత ప్రధాన నగరాల్లో పెద్ద ఆసుపత్రులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినప్పటికీ చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలు ప్రాథమిక సౌకర్యాలు, కనెక్టివిటీ కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు. ప్రజాహిత, చురుకైన సుపరిపాలన విధానంతో చిన్న పట్టణాలు, గ్రామాలకు ఎక్స్‌ప్రెస్‌వేలు, వైద్య కళాశాలలు, ఆరోగ్య సేవలు, డిజిటల్‌ కనెక్టివిటీని విస్తరిస్తున్నట్లు తెలిపారు.

1960, 1970 దశకాల్లో పేదలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పటికీ, 2014 వరకు దేశ జనాభాలో సగానికిపైగా ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేవని మోదీ పేర్కొన్నారు. గతంలో కొందరు కాంగ్రెస్‌ నాయకులకు సన్నిహితంగా ఉన్నవారికి ఫోన్‌ ద్వారా వేల కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యేవని ఆయన ఆరోపించారు. దీనిని ‘ఫోన్‌ బ్యాంకింగ్‌’గా అభివర్ణించారు.

ప్రస్తుత ప్రభుత్వం డిజిటల్‌ బ్యాంకింగ్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఆర్థిక సేవల ప్రాప్యతను విస్తరించిందని పేర్కొన్నారు. దాదాపు 59 నుంచి 60 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు ప్రజలను అధికారిక బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. గతంలో కేంద్రం నుంచి పంపిన నిధుల్లో కొంత భాగమే లబ్ధిదారులకు చేరేదన్న మాజీ ప్రధాని వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. 

గత దశాబ్దంలో బ్యాంకింగ్‌ సేవలకు దూరంగా ఉన్న ప్రజలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టామని, రాబోయే దశాబ్దంలో బ్యాంకింగ్‌ సేవలను మరింత సమర్థవంతంగా, విశ్వసనీయంగా మార్చడమే లక్ష్యమని ప్రధాని తెలిపారు.

About The Author