మొబైల్‌కు వచ్చే గుర్తు తెలియని కాల్స్‌లో పేరు కనిపించడంతో పాటు, నవంబర్ నుంచి క్రెడిట్ కార్డు ఛార్జీలు, జీఎస్టీ నిబంధనలు, గ్యాస్ సిలిండర్ ధరలు, డిజిటల్ వ్యక్తిగత సమాచార రక్షణ వంటి అంశాలలో కీలక మార్పులు రాబోతున్నాయి. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాల ప్రకారం, టెలికాం సంస్థలు సేవే కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సిఎన్ఏపీ)ను నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ విధానం ద్వారా ఫోన్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు, టెలికాం సంస్థ వద్ద నమోదైన పేరు ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ప్రస్తుతం చాలామంది తెలియని నంబర్ల వివరాల కోసం ట్రూకాలర్ వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. సిఎన్ఏపీ సేవ అందుబాటులోకి వస్తే టెలికాం సంస్థల రికార్డుల ఆధారంగా కాలర్ పేరును తెలుసుకోవచ్చు. దీంతో గుర్తు తెలియని కాల్స్‌ను గుర్తించడం సులభమవుతుంది. ఈ సేవను 4జి, 5జినెట్‌వర్క్‌లలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కొన్ని బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు నవంబర్‌లో సేవా ఛార్జీలు, వడ్డీ, రివార్డ్ పాయింట్లకు సంబంధించిన నిబంధనలను సవరించనున్నాయి. ఈ మార్పులు అన్ని బ్యాంకులకు లేదా అన్ని కార్డులకు ఒకేలా వర్తించవు.
మనం మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్లు ఉపయోగించేటప్పుడు పేరు, ఫోన్ నంబర్, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను అందిస్తుంటాం. ఈ సమాచారాన్ని సంస్థలు ఎలా సేకరించాలి, ఎలా ఉపయోగించాలి అనే అంశాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డిపిడిపి) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా 2026 నవంబర్ 13 నుంచి కన్సెంట్ మేనేజర్లకు సంబంధించిన కొన్ని నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
డిపిడిపి చట్టంలోని ప్రధాన నిబంధనలు 2027 మే 13 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. వీటి ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే సంస్థలు దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాయో స్పష్టంగా తెలియజేయాలి. సమాచార భద్రతకు చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత సమాచారం లీక్ అయితే నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులకు, అధికారులకు తెలియజేయాలి. ఫిర్యాదుల పరిష్కారానికి కూడా తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
బ్యాంకులు, ఆసుపత్రులు, బీమా సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు, టెలికాం సంస్థలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని నిర్వహించే సంస్థలు ఈ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావాలి. ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్ కొనసాగేందుకు ప్రతి ఏడాది తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. దీనినే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లేదా ‘జీవన్ ప్రమాణ్’ అంటారు. 2026 నవంబర్ 1 నుంచి 30 వరకు 80 ఏళ్లలోపు అర్హులైన పెన్షనర్లు తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సూపర్ సీనియర్ పెన్షనర్లకు ఈ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచే ప్రారంభమైంది.

More Stories
సైబర్ దాడులతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు
ఈశాన్యంలో రూ.100 కోట్ల హవాలా మార్గం, 500 డిటోనేటర్లు స్వాధీనం
శబరిమల నెయ్యి అక్రమ తరలింపు కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు