9-12 తరగతులకు ఏఐ పాఠాలు- డీప్‌ఫేక్‌ల గుర్తింపుపై ప్రత్యేక శిక్షణ

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం కంప్యూటేషనల్‌ థింకింగ్‌ (సీటీ), కృత్రిమ మేధస్సు (ఏఐ) అంశాలపై 20 గంటల పరిచయ మాడ్యూల్‌ను రూపొందించింది. రోజువారీ జీవితంలో ఏఐ వినియోగం, యంత్రాలు ఉదాహరణల ద్వారా నేర్చుకునే విధానం, డీప్‌ఫేక్‌ల గుర్తింపు, వ్యక్తిగత సమాచార గోప్యత వంటి అంశాలను ఇందులో చేర్చింది. 

ఆధునిక సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడంతోపాటు, దాని ద్వారా వచ్చే సమాచారాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఎన్సీఈఆర్టీ ఈ విద్యా మాడ్యూల్ను ఐఐటీ మద్రాసు, ఐఐటీ జోధ్‌పుర్‌ నిపుణుల సంప్రదింపులతో అభివృద్ధి చేసింది. ఏఐపై గతంలో ఎలాంటి అవగాహన లేని విద్యార్థులు కూడా సులభంగా నేర్చుకునేలా దీనిని రూపొందించారు. 

కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడమే కాకుండా, సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలను అన్వేషించడం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించారు. సమస్యలను క్రమపద్ధతిలో విశ్లేషించి, వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించి, పరిష్కార మార్గాలను గుర్తించే విధానమే కంప్యూటేషనల్‌ థింకింగ్‌. ఈ ఆలోచనా పద్ధతిని విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా క్లిష్టమైన సమస్యలను తార్కికంగా పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని ఎన్‌సీఈఆర్‌టీ భావిస్తోంది. 

అదే సమయంలో ఏఐ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? వాటికి ఎలాంటి సామర్థ్యాలు ఉన్నాయి? ఏ సందర్భాల్లో అవి తప్పులు చేయొచ్చు? అనే అంశాలను విద్యార్థులు తెలుసుకునేలా పాఠ్యాంశాలను రూపొందించారు. ప్రస్తుతం ఏఐ సాయంతో నకిలీ చిత్రాలు, వీడియోలు, స్వరాలను సృష్టించడం సులభమవుతోంది. వాస్తవంగా జరగని సంఘటనలు జరిగినట్లుగా చూపించే డీప్‌ఫేక్‌ కంటెంట్‌ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. 

ఈ నేపథ్యంలో అలాంటి సమాచారాన్ని గుర్తించడం, దాని విశ్వసనీయతను పరిశీలించడం వంటి అంశాలకు కొత్త మాడ్యూల్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ఏఐ ద్వారా రూపొందించిన సమాచారాన్ని చూసిన వెంటనే నమ్మకుండా, దాని నిజానిజాలను ధ్రువీకరించుకోవాలని విద్యార్థులకు నేర్పించనున్నారు. తప్పుడు సమాచారం ఎలా వ్యాప్తి చెందుతుంది? దాన్ని గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను కూడా కార్యకలాపాల ద్వారా వివరించనున్నారు.

ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచార గోప్యత, డిజిటల్‌ భద్రతపై అవగాహన అవసరమని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం, డేటాను బాధ్యతాయుతంగా ఉపయోగించడం వంటి అంశాలను ఈ మాడ్యూల్‌లో చేర్చారు. అలాగే ఏఐ వ్యవస్థలు అందించే ఫలితాల్లో పక్షపాత ధోరణులు ఉండే అవకాశాన్ని అర్థం చేసుకోవడం, సమాచారాన్ని సమానత్వ దృక్పథంతో పరిశీలించడం, సాంకేతికతను నైతిక పరిమితులకు లోబడి ఉపయోగించడం వంటి అంశాలపైనా అవగాహన కల్పించనున్నారు.

విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని అంశాలను చదివేలా కాకుండా, చర్చలు, ప్రయోగాలు, ప్రాక్టికల్‌ వ్యాయామాలు, అనుభవాల ఆధారంగా నేర్చుకునే విధానాన్ని ఈ మాడ్యూల్‌లో అనుసరించారు. డిజిటల్‌ పరికరాలు అందుబాటులో ఉన్నా లేకపోయినా తరగతి గదుల్లో ఈ కార్యకలాపాలను నిర్వహించవచ్చని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. దీంతో విభిన్న వసతులున్న పాఠశాలల విద్యార్థులకు కూడా ఏఐపై ప్రాథమిక అవగాహన పొందే అవకాశం ఉంటుంది.

About The Author