మాజీ మంత్రి రజినీపై దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐపై వేటు!

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం మధ్యాహ్నం మాజీ మంత్రి విడదల రజినిని తోసివేయడంతో ఆమె కిందపడిన ఘటనకు సంబంధించిన వీడియోలు, మీడియా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర దుమారం రేపాయి.  మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకోవడమే కాకుండా, ఆమెపై దురుసుగా వ్యవహరించి కిందకు తోసేసిన చిలకలూరిపేట రూరల్ ఎస్సై లేఖా ప్రియాంకపై  రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సై ప్రియాంకను తక్షణమే విధుల నుంచి తొలగించాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. 
 
రాబోయే ఎన్నికల డ్యూటీలతో పాటు అన్ని రకాల పోలీసు విధులనుంచి ఆమెను తప్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నిర్ణీత గడువులోగా సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలించి నివేదిక అందించాలని సూచించింది. మూడు రోజులుగా తనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా గృహనిర్బంధం చేయడంపై రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మూడు రోజులుగా ఆమెను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆమెను కలిసేందుకు వైసీపీ శ్రేణులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయి తనను కలిసేందుకు రాగా, విడదల రజినీ ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిలకలూరిపేట రూరల్‌ ఎస్సై ప్రియాంక ఆమెను అడ్డుకున్నారు. 
ఈ  క్రమంలో ఎస్సై విడదల రజినీపై దౌర్జన్యానికి దిగారు. బయటకు వెళ్లకుండా ఎస్‌ఐ గట్టిగా నెట్టేయడంతో ఒక్కసారిగా ఆమె కిందపడిపోయారు. ఎస్సై తీరుపై రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నీకు పిచ్చిపట్టిందా? నన్ను చంపేస్తవా? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు? అంటూ ఎస్‌ఐపై రజిని మండిపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఇలాంటి ఘటనలే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం మొలకలచెరువు ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల దాఖలును అడ్డుకున్న ఉదంతంలోనూ చోటుచేసుకున్నాయి. ఎన్నికల విధుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె. దస్తగిరి, ఎస్సై పి. రామకృష్ణల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం వారిని ఎన్నికల విధులతో పాటు క్రమశిక్షణా చర్యల కింద తక్షణమే సస్పెండ్ చేస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.             

About The Author