హైదరాబాద్‌కు తరలిస్తున్న బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ పట్టివేత

బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్, విజయవాడ రీజనల్ యూనిట్ల అధికారులు సంయుక్తంగా దాడులు చేసి ముఠా కార్యకలాపాలను గుర్తించారు. బుధవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.5.84 కోట్ల విలువైన 3.1 కేజీల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నట్లు డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. విజయవాడ శివారు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న అనుమానిత స్కార్పియో వాహనాన్ని అధికారులు అడ్డగించి తనిఖీ చేశారు. వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో దాచిన విదేశీ కరెన్సీని వెలికితీశారు. పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, మార్కెట్‌లో అక్రమంగా విక్రయించిన బంగారానికి సంబంధించిన సొమ్మే ఇదని వారు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. 

అదే సమయంలో హైదరాబాద్ వైపు భారీగా బంగారం తరలిస్తున్న మరో ముఠా కదలికల సమాచారాన్ని వారు వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు.  దీంతో అప్రమత్తమైన డీఆర్‌ఐ బృందాలు మార్గమధ్యంలోని ఓ టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టి, హైదరాబాద్ వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అడ్డగించాయి. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారు ధరించిన ప్రత్యేక నడుము పౌచ్‌లలో దాచిన 3,147.1 గ్రాముల బరువున్న మూడు విదేశీ మార్కింగ్ కలిగిన బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. 

వీటితో పాటు వారి వద్ద నుంచి 60,000 అమెరికన్ డాలర్లు, 21,500 యూరోల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, కరెన్సీ మొత్తం విలువ సుమారు రూ.5.84 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్‌తో వారికి ఉన్న సంబంధాలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.  

About The Author