సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల తదుపరి ప్రక్రియను తక్షణమే నిలిపేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు, శాంతిభద్రతల సమస్యలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలించింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ వాయిదా వేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. అలాగే శాంతిభద్రతల సమస్యల కారణంగా కొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయినట్లు భావిస్తే, ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల గడువును పొడిగించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. వైసీపీ తన పిటిషన్లో 19 మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదని తెలిపింది.
ఆయా చోట్ల నామినేషన్ల పొడిగింపునకు గురువారంలోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను 25వ తేదీ వరకు నిలిపివేయాలని ఆదేశించింది. మొత్తం అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆపేయాలన్నట్లుగా ఆ ఆదేశాలు ఉండడంతో స్పష్టత కోసం ఎస్ఈసీ ఇప్పటికే న్యాయనిపుణులను సంప్రదించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీల నుంచి నివేదికలు తీసుకున్న అనంతరం 22న తదుపరి ఉత్తర్వులు జారీచేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నామినేషన్ల గడువు పొడిగించాలని నిర్ణయించిన చోట.. ఆ నిర్ణయాన్ని ప్రకటించిన సమయం నుంచి కనీసం 48 గంటల పాటు గడువు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. వైసీపీ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగానే ఆయన ఏ డు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైసీపీ ఆరోపణలకు సంబంధించి తమకు నివేదికలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్లు, ఎస్పీల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా తగిన నిర్ణ యం తీసుకుంటామని వెల్లడించారు.
కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ), నో డ్యూ సర్టిఫికెట్ సమర్పించాలంటూ కొందరు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు నిబంధనలు విధిస్తున్నారంటూ కొన్ని పార్టీలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్వోసీ, నో డ్యూ సర్టిఫికెట్లు తప్పనిసరి నిబంధన ఎన్నికల నియమావళిలో లేదని తేల్చిచెప్పింది.

More Stories
హైదరాబాద్‌కు తరలిస్తున్న బంగారం స్మగ్లింగ్ రాకెట్ పట్టివేత
హింస జరిగిన 19మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పొడిగింపు
విజయవాడ మేయర్ రేసులో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు