ఇస్రో 30న ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం ప్రయోగం

దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని ఈనెల 30వ తేదీన ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించనున్నారు. భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థకు ప్రస్తుతం ఎదురవుతున్న ఉపగ్రహాల కొరతను అధిగమించడంలో ఈ ప్రయోగం కీలక పాత్ర పోషించనుంది.

అమెరికాకు చెందిన జీపీఎస్ మొబైల్ ఫోన్లలో లొకేషన్ గుర్తించడం నుంచి వాహనాలకు మార్గనిర్దేశం చేయడం వరకు అనేక సేవలకు ఉపయోగపడుతోంది. ఇదే తరహాలో భారత్ కూడా తన సొంత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దాని పేరే  నావిక్  (నావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెల్లేషన్). ఈ నావిక్ వ్యవస్థ భారత భూభాగంతో పాటు దేశ సరిహద్దుల వెలుపల సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ సమాచారాన్ని అందించేందుకు రూపొందించారు. 
 
రవాణా, సముద్ర కార్యకలాపాలు, అత్యవసర సేవలు, ఇతర పౌర అవసరాలతో పాటు వ్యూహాత్మక రంగాల్లోనూ నావిక్ సేవలకు ప్రాధాన్యం ఉంది. ఇతర దేశాల ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలపై పూర్తిగా ఆధారపడకుండా సొంత సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి నావిక్ ఉపయోగపడుతుంది. అందుకే ఈ వ్యవస్థలో ఉపగ్రహాల పనితీరు, నిరంతర సేవలు భారత్‌కు ముఖ్యమైన అంశాలుగా మారాయి.
 
ఇస్రో రెండో తరం నావిక్ ఉపగ్రహాల కార్యక్రమంలో భాగంగా ఎన్‌వీఎస్-03ను అభివృద్ధి చేస్తోంది. పాత ఉపగ్రహాల స్థానంలో కొత్త తరం ఉపగ్రహాలను అందుబాటులోకి తీసుకురావడం, నావిగేషన్ సేవల విశ్వసనీయతను పెంచడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యాలు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహం కక్ష్యలో విజయవంతంగా చేరి, అవసరమైన పరీక్షలు పూర్తయ్యాక కార్యకలాపాలు ప్రారంభిస్తే నావిక్ వ్యవస్థలో స్వతంత్ర స్థాన నిర్ధారణ సామర్థ్యాన్ని తిరిగి బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది.

నావిక్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఎన్‌వీఎస్-03తోనే కార్యక్రమాన్ని ముగించడం లేదు. ఎన్‌వీఎస్-04, ఎన్‌వీఎస్-05 ఉపగ్రహాల అభివృద్ధి కూడా ముందడుగు వేసిన దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉపగ్రహాలు అందుబాటులోకి వస్తే దేశీయ నావిగేషన్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది.

About The Author