ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రానికి రానున్నారని, రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని బిజెపి వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, కాజీపేటలో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా కోరుకొంటున్న ఈ యూనిట్‌కు సంబంధించి ఒకప్పుడు ప్రతిపాదన వచ్చినా ఇతర రాష్ట్రాలకు మళ్లించారనే విమర్శలు వచ్చేవి.
ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంది. ఇక్కడ కోచ్‌లు, వ్యాగన్లు, మెట్రో కోచ్‌లు తయారు చేసే అవకాశం ఉంది. ఇది వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించనుంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతో పాటు రైల్వే రంగంలో కొత్త అవకాశాలు మెరుస్తాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో ములుగులోని సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించనున్నారు.
గిరిజన ప్రాంతాల విద్యాభివృద్ధికి ఇది మైలురాయిగా మారనుంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక భాషలు, అడవి వనరుల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక కోర్సులు అందించేలా ఈ యూనివర్సిటీని రూపొందించారు. ఇది గిరిజన యువతకు ఉన్నత విద్య అందుబాటులోకి తెచ్చి, ఉపాధి అవకాశాలు పెంచుతుంది. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేను కూడా ప్రారంభించనున్నారు.
ఈ హైవే రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం చేస్తుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా. మరో ముఖ్యమైన కార్యక్రమం వరంగల్ మామునూరు విమానాశ్రయానికి భూమి పూజ. ఈ విమానాశ్రయం కోసం దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. పాత ఎయిర్‌స్ట్రిప్‌ను అభివృద్ధి చేసి ఆధునిక విమానాశ్రయంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఇది పూర్తయితే వరంగల్, హన్మకొండ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. పర్యాటకం, వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఇది ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఈ పర్యటనకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ రెండో వారంలో రాష్ట్రానికి రానున్నారు. ఆయన బూత్ కమిటీ సమావేశాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్, కరీంనగర్ల్లో కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

More Stories
ఇన్వెస్ట్మెంట్ యాప్‌ల అంతరాష్ట్ర ముఠాలపై ఈడీ దాడులు
సాంస్కృతిక ఏకత్వాన్ని ప్రతిబింబించే ‘అలయ్ బలయ్’
మినరల్స్ లో సహకారం బలోపేతానికి కిషన్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన