భారత్, ఆస్ట్రేలియా, ఇతర దేశాల మధ్య గనులు, క్రిటికల్ మినరల్స్, ఆధునిక సాంకేతికత, ప్రాసెసింగ్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అక్టోబర్ 25 నుంచి 30 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, మైనింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామికవేత్తలతో విస్తృత చర్చలు జరపనున్నారు.
అక్టోబర్ 25న కేంద్ర మంత్రి సిడ్నీ చేరుకొని 26న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండిసి) సిడ్నీ కార్యాలయం ప్రారంభించి, సంస్థ కార్యకలాపాలను సమీక్షిస్తారు. అదే రోజు అంతర్జాతీయ మైనింగ్ మరియు వనరుల సమావేశం మరియు ఎక్స్పో (ఐఎంఏఆర్సి)లో పాల్గొని కీలకోపన్యాసం చేస్తారు. 27న ఆస్ట్రేలియా వనరులు, ఉత్తర ఆస్ట్రేలియా వ్యవహారాల శాఖ మంత్రి మడలైన్ కింగ్‌తో సమావేశం కానున్నారు.
ఐఎంఏఆర్సి సదస్సులో ఎన్ఎండిసి ఏర్పాటు చేస్తున్న ‘ఇండియా పెవిలియన్’ను కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. ప్రధాన ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీలు, బిఆర్ఏవియుఎస్ సంస్థ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) మైనింగ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశం కానున్నారు. 28న మినరల్స్ కౌన్సిల్ అఫ్ ఆస్ట్రేలియాతో క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఖనిజాలపై జరగనున్న ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. ఆస్ట్రేలియా వనరుల శాఖ సహాయ మంత్రి ఆంథనీ చిషోల్మ్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
28న మెల్బోర్న్లో మనదేశానికి చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ బీసీసీ) ఆస్ట్రేలియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆయన సమక్షంలో ఎన్ బీసీసీ-గోల్డ్ ఫీల్డ్ ఆస్ట్రేలియా మధ్య అవగాహన ఒప్పందాల మార్పిడి జరగనుంది. ఆ తర్వాత ప్రవాస భారతీయులతో కిషన్ రెడ్డి సమావేశమవుతారు.
29న మోనాష్ విశ్వవిద్యాలయంలో జరిగే క్రిటికల్ మినరల్స్, మైనింగ్‌లో నూతన సాంకేతికత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత, ఖనిజ వనరుల అభివృద్ధి, సంయుక్త పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధిపై జరిగే సదస్సులో పాల్గొంటారు. అదేవిధంగా విశ్వవిద్యాలయంలోని పలు రకాల పరిశోధనా సదుపాయాలను కూడా పరిశీలించి యూనివర్సిటీ అధికారులతో చర్చించనున్నారు.
విక్టోరియా ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో భారతదేశంలో పెట్టుబడులు, మైనింగ్ ప్రాజెక్టుల అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ మెటలర్జీ సీనియర్ శాస్త్రవేత్తలతో, సాంకేతిక నైపుణ్యం, వృత్తిపరమైన శిక్షణ, మైనింగ్ రంగానికి అవసరమైన నిపుణుల తయారీ, పర్యావరణహిత మైనింగ్ విధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం, 30వ తేదీన కేంద్ర మంత్రి భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

More Stories
పంజాబ్‌లో ఎన్డీయే ప్రభుత్వం.. అకాలీ దళ్ తో పొత్తుపై అమిత్ షా సంకేతం!
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలింపుకై ఈటల పాదయాత్ర
తెలంగాణాలో గోదావరి పుష్కరాలకు రూ.900 కోట్లు