సముద్రపు గాలి ఉన్నా ముంబైలో కాలుష్యమా? 

మహారాష్ట్ర రాజధాని ముంబైలో కాలుష్య స్థాయిలు దేశ రాజధాని ఢిల్లీని కూడా మించిపోతుండటం పట్ల బొంబాయి హైకోర్టు తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నగరం ఇటువంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటుంటే అధికారులు ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నారని ప్రశ్నించింది. నగరంలో కాలుష్యం పెరిగిపోవడంతో విజిబిలిటీ 500 మీటర్ల కంటే తక్కువకు పడిపోయిందని, కాలుష్య సూచీల్లో ముంబై ఢిల్లీని దాటేసిందని వచ్చిన నివేదికలను ధర్మాసనం ప్రస్తావించింది. 

గడిచిన వారంలో aqi.in గణాంకాల ప్రకారం ముంబై వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 150 నుండి 200 మధ్య నమోదు కావడం గమనార్హం. లక్షలాది మంది ప్రజలు ఇటువంటి అత్యవసర పరిస్థితితో నరకం చూస్తుంటే, బాధ్యతాయుతమైన అధికారులు ఏమీ పట్టనట్లు ఎలా నిద్రపోతున్నారని జస్టిస్ కుల్కర్ణి తీవ్రంగా ప్రశ్నించారు. ముఖ్యంగా పండుగలు, ఊరేగింపుల సమయంలో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (ఎంపిసిబి), పోలీసులు విఫలమయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది.

“ఇది నిజంగా దిగ్భ్రాంతికరం. నగరానికి అపారమైన సముద్ర తీరం, విశాలమైన ఖాళీ స్థలాలు, సముద్రపు గాలులు వీచే సౌకర్యం ఉన్నాయి. అయినా మనం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ముంబై ఆకాశం నిర్మలంగా, స్వచ్ఛంగా ఉండేలా చూసే బాధ్యత అధికారులపై ఉంది,” అని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు చాలా సాధారణంగా ఉల్లంఘిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అక్టోబర్ 15న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వీధులు, సందులు, పాదచారుల మార్గాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయితే ఈ నిషేధం గురించి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందించడంలో బిఎమ్‌సి, ఎంపిసిబి పూర్తిగా విఫలమయ్యాయని కోర్టు తన లిఖితపూర్వక ఉత్తర్వుల్లో తప్పుపట్టింది. 

గత ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని, శబ్ద పరిమితి హామీలను తీసుకోవాలని, బహిరంగంగా బాణసంచా కాల్చడాన్ని అరికట్టాలని, నిర్మాణ స్థలాల వద్ద కాలుష్య నివారణ చర్యలు చేపట్టేలా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది.  

ఇటీవల, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, బాణసంచా నియంత్రణపై చర్చిస్తూ, “ఆచరణాత్మక, వాస్తవిక దృక్పథం” అవసరమని వ్యాఖ్యానించింది. అతిగా కఠినమైన నిబంధనలు విధిస్తే ప్రజలలో అసంతృప్తికి దారితీయవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో, తక్కువ కాలుష్యాన్ని కలిగించే “గ్రీన్ క్రాకర్స్” వాడకానికి సెప్టెంబర్ 30న జస్టిస్ ఎం.ఎం. సుందరేష్‌తో కూడిన ధర్మాసనం దేశవ్యాప్త అనుమతి మంజూరు చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసుకుంది.

About The Author