* సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్నది. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ఆగ్రహించిన స్థానికులు మృతదేహాలను సీఎం నివాసం వద్దకు తరలించి నిరసన తెలిపారు. తాజా హింసాత్మక ఘటనలతో మణిపూర్‌లో భద్రతా పరిస్థితి మరింత దిగజారింది. మొదటి ఘటనలో మైతేయి ప్రజలు, పాంగల్ ముస్లింలు నివసించే ప్రాంతంలో ఒక సంగీత కార్యక్రమం జరుగుతుండగా హింస చెలరేగింది.
రాళ్ల దాడి, కాల్పులు జరుగడంతో పలువురు గాయపడ్డారు. బుల్లెట్ గాయాలైన 24 ఏళ్ల యువకుడు మరణించాడు. కాగా, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్లోక్ ప్రాంతంలో మరో హింసాత్మక ఘటన జరిగింది. సమీపంలోని కొండల్లో కట్టెల కోసం వెళ్లిన ముగ్గురు గ్రామస్తులను, కుకీ గిరిజన మిలిటెంట్లుగా అనుమానించిన వ్యక్తులు కాల్చి చంపారు.
ఈ కాల్పుల్లో మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. అయితే ఈ హత్యలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి మృతదేహాలను తరలించి నిరసన చేపట్టగా పోలీసులు వాటిని బలవంతంగా తొలగించారు. ఆందోళనకారును చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు రాజ్ మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ పరామర్శించారు. ఈ హత్యల నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తడంతో ఇంఫాల్ నగరం దాదాపు స్తంభించింది.
సమీపంలోని ఎస్వోవో శిబిరాన్ని తొలగించడంతో సహా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తోక్చోమ్ లోకేశోర్ సింగ్ డిమాండ్ చేశారు. కుకీ-జో మిలిటెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ‘సినాయ్ క్యాంప్’గా గుర్తించిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ శిబిరాన్ని తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఆ ప్రాంతంలో కట్టెలు సేకరిస్తున్నప్పుడు గ్రామస్తులకు భద్రత కల్పిస్తామని అస్సాం రైఫిల్స్ సిబ్బంది హామీ ఇచ్చారని కూడా ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని, తదుపరి హింసను నివారించడానికి చర్యలు తీసుకోవాలని సింగ్ కోరారు. ఈ రెండు వర్గాలకు చెందిన సభ్యుల మధ్య జరిగిన ఇలాంటి హత్యకు సంబంధించిన చివరి సంఘటన జనవరిలో నమోదైంది.
కుకీ-జో ఆధిపత్యం గల చురాచంద్పూర్ జిల్లాలో తన భార్యను కలవడానికి వెళ్లిన ఒక మైతేయ్ వ్యక్తిని ఆమె నివాసం నుండి బయటకు లాగి కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత, ఈ హత్యను చూపిస్తున్నట్లుగా భావిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో, మైతేయ్ సమాజంలో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.

More Stories
ఆలయం వద్ద భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. 15 మంది మృతి
ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు
జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత