మునీర్ దెబ్బకు పాకిస్థాన్ నుంచి బ్యూరోక్రాట్ల నిష్క్రమణ

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందనే నివేదికల మధ్య ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఎన్నుకున్న ప్రభుత్వంపై అక్కడ పాలకవర్గానికి నమ్మకం సడలుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో పాక్ అధికారులు భారీ సంఖ్యలో దేశం విడిచి వెళ్తున్నారంటూ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది అధికారులు ఉద్యోగంలో ఉన్నప్పుడే విదేశాలలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకున్నారని ఆయన ఆరోపించారు.

‘ఎక్స్’  వేదికగా స్పందించిన ఖవాజా ఆసిఫ్ పాకిస్థాన్ బ్యూరోక్రసీలోని పలువురు అధికారులు గత కొన్నేళ్లుగా కెనడా, అమెరికా, బ్రిటన్, ఇతర ఐరోపా దేశాలను తమ శాశ్వత నివాసాలుగా మార్చుకున్నారని పేర్కొన్నారు.‘‘వీరు (అధికారులు) పాకిస్థాన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం దీనికి సిద్ధమయ్యారు. ఇది తమ మాతృభూమి పట్ల, వారి పదవీకాలంలో బాధ్యతల పట్ల వారికీ ఉన్న అంకితభావంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది’’ అని ఆసిఫ్ పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో ఈ బ్యూరోక్రాట్ల నిష్క్రమణకు పోర్చుగల్ ప్రధాన గమ్యస్థానంగా మారిందని రక్షణ మంత్రి గమనించారు. ఈ వ్యవహారంలో పేర్లు బయటకు వచ్చిన అధికారులు కీలక పదవుల్లో కొనసాగారని, వరుసగా వచ్చిన ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరి పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా, ఎటువంటి ఆధారాలు చూపకుండా అధికారుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, వారికి విదేశీ పౌరసత్వం/ పీఆర్  ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి ప్రస్తుతం పరారయ్యాడని ఆసిఫ్ ఆరోపించారు.

అలాంటి అధికారుల నిబద్ధతను ప్రశ్నిస్తూ, వారి కెరీర్‌లో పాకిస్థాన్ పట్ల ఉన్న విశ్వసనీయత అనుమానాస్పదంగానే ఉందని తెలిపారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటూ, చట్టబద్ధమైన, అక్రమ మార్గాల ద్వారా సంపదను సమకూర్చుకున్న అధికారుల తీరుపై ఆసిఫ్ సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘ఇది అన్ని అనుమానాలకు అతీతంగా ఉందా? లేక వారు కేవలం తాత్కాలికంగా ఇక్కడ ఉంటున్నారా?’’ అని ప్రశ్నిస్తూ సదరు అధికారులు విదేశాలలో స్థిరపడటానికి ముందు పాకిస్థాన్‌ను ఒక తాత్కాలిక నివాసంగా మాత్రమే చూశారా? అని ఆయన ప్రశ్నించారు.

ఈ ఆరోపణలు పాకిస్థాన్‌లో ప్రజా-సైనిక పాలనలో ఉన్న సివిల్ సర్వీస్ వ్యవస్థ, విదేశీ ఆస్తుల యాజమాన్యం, జవాబుదారీతనంపై దృష్టి మరల్చాయి. పాకిస్థాన్‌లో సివిల్ బ్యూరోక్రసీ ఎల్లప్పుడూ సాయుధ దళాల నీడలోనే పనిచేస్తుంది. అక్కడ సైన్యం రాజకీయ వ్యవస్థలో చారిత్రాత్మకంగా అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) మద్దతుతో కొనసాగుతున్న ప్రస్తుత షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్ ప్రభుత్వం, పూర్తిగా ఆసిమ్ మునీర్‌పై ఆధారపడి నడుస్తున్నట్లు కనిపిస్తోంది.  

About The Author