ఆసియా పారా గేమ్స్‌లో మూడో రోజుల్లో 62 పతకాలు

జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న  ఆసియా పారా గేమ్స్‌-2026లో మూడు రోజులలో భారత్‌ మొత్తం 62 పతకాలు సాధించింది. ఇందులో 14 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తోంది. ప్రస్తుత పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో ఉండగా, జపాన్‌, ఉజ్బెకిస్థాన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది. 
 
గతంలో హాంగ్‌జౌలో జరిగిన 2023 ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ 111 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఈసారి కూడా భారత క్రీడాకారులు అదే పట్టుదలతో పోటీపడుతున్నారు. భారత అథ్లెట్లలో స్ప్రింట‌ర్ సిమ్ర‌న్ శ‌ర్మ‌ చ‌రిత్ర సృష్టించింది. 100మీట‌ర్ల టీ12 ఈవెంట్‌లో రెండో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్న‌ది. ఆమె  కేవ‌లం 12.02 సెక‌న్ల‌లో టార్గెట్‌ను ఫినిష్ చేసింది. మంగ‌ళ‌వారం 200మీట‌ర్ల టీ12 స్ప్రింట్ ఈవెంట్‌లోనూ సిమ్ర‌న్‌కు స్వ‌ర్ణం దక్కింది. 
 
పురుషుల 100 మీటర్ల టి47 ఈవెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ దిలీప్ మహాదు గావిత్ స్వర్ణం సాధించాడు. అదే ఈవెంట్‌లో మహమ్మద్ బాసిల్ రజతం సాధించాడు. పురుషుల హైజంప్ టి64లో ప్రవీణ్ కుమార్ 2.05 మీటర్ల గేమ్స్ రికార్డు ఎత్తును అధిగమించి స్వర్ణం గెలుచుకోగా, రజత పతక విజేత బంటి (1.92 మీటర్లు)తో కలిసి భారత్ 1-2 స్థానాలను కైవసం చేసుకుంది. పురుషుల షాట్‌పుట్ విభాగంలో కూడా భారత్ క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. 
 
పారాలింపిక్ పతక విజేత సచిన్ ఖిలారి 15.87 మీటర్ల గేమ్స్ రికార్డు త్రోతో స్వర్ణం కైవసం చేసుకోగా, మహ్మద్ యాసర్ (15.06 మీటర్లు) , పర్వీన్ (14.94 మీటర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. పరుగులు, హైజంప్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో విభాగాల్లో భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. నిషాద్‌ కుమార్‌ లాంగ్‌జంప్‌, హైజంప్‌ విభాగాల్లో స్వర్ణాలు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. దీప్తి జీవాంజి 400 మీటర్ల పరుగులో పసిడి పతకాన్ని గెలుచుకున్నారు. 
 
జావెలిన్‌ త్రోలో రింకు, డిస్కస్‌ త్రోలో ప్రణవ్‌ సూర్మా స్వర్ణాలు సాధించారు. షాట్‌పుట్‌లో సచిన్‌ ఖిలారీ స్వర్ణం సాధించగా, పురుషుల హైజంప్‌ టీ64 విభాగంలో ప్ర‌వీణ్‌ కుమార్‌ అగ్రస్థానంలో నిలిచారు. వివిధ విభాగాల్లో రజత, కాంస్య పతకాలు కూడా భారత్‌కు లభించడంతో పతకాల పట్టికలో దేశం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత క్రీడాకారులు అథ్లెటిక్స్‌కే పరిమితం కాకుండా షూటింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, జూడో, పవర్‌లిఫ్టింగ్‌, ఆర్చరీలోనూ పతకాలు సాధించారు. 
 
మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మోనా అగర్వాల్‌ స్వర్ణం సాధించగా, అవని లేఖరా రజతంతో సరిపెట్టుకున్నారు. పారా ఆర్చరీలో శీతల్‌ దేవి, పాయల్‌ నాగ్‌ రజత పతకాన్ని అందుకున్నారు. స్విమ్మింగ్‌లోనూ భారత క్రీడాకారులు రజత, కాంస్య పతకాలతో సత్తాచాటారు. 

About The Author