అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు చేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. 2025 జనవరిలో ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేరాలు, ప్రజా భద్రతకు ముప్పు, వీసా నిబంధనల ఉల్లంఘన, మోసపూరిత సమాచారంతో వీసాలు పొందడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపా రు. 2026 ఆగస్టు 10 నాటికి 1.75 లక్షలకు పైగా వీసాలు రద్దయ్యాయని విదేశాంగ శాఖ తెలిపింది.
సెప్టెంబరు చివరికి ఈ సంఖ్య 2.50 లక్షలకు చేరినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 20న 3 లక్షల మార్కును దాటినట్లు ప్రకటించారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత వేగంగా వీసాలు రద్దు చేయలేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ చెప్పారు. చట్టాలు ఉల్లంఘించేవారు, మోసాలకు పాల్పడేవారు, దేశ భద్రతకు ముప్పుగా ఉన్నవారిపై ఉపేక్ష ఉండదని చెప్పారు.
దాడులు, హింసాత్మక నేరాలు, మద్యం మ త్తులో వాహనాలు నడపడం (డీయూఐ), దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం లేదా నకిలీ పత్రాలు, వీసా షరతుల ఉల్లంఘన, ప్రజా లేదా జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన కార్యకలాపాలు వీసా రద్దుకు కారణాలుగా పేర్కొన్నారు. 2025లో రద్దైన వీసాల్లో సుమారు 25 శాతం దాడులు లేదా వాటికి సంబంధించిన నేరాలతో, 22 శాతం డీయూఐ కేసులతో సంబంధం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
దొంగతనాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా పంపిణీ కేసులనూ ప్రస్తావించాయి. అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం ద్వారా పౌరసత్వం పొందే అవకాశాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయాణించడాన్ని బర్త్ టూరిజం అంటారు. దీనికి పాల్పడినట్లు లేదా సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు సంబంధించిన కనీసం 4,000 వీసాలు రద్దయ్యాయని వార్తా సంస్థలు తెలిపాయి.
దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు, ప్రయాణ ఉద్దేశాన్ని తప్పుగా వెల్లడించడంపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. విద్యార్థి, పర్యాటక, ఉద్యోగ వీసాల నిబంధనల అమలును అధికారులు కఠినతరం చేస్తున్నారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. సామాజిక మాధ్యమ ఖాతాల పరిశీలనను విస్తరించినట్లు కూడా తెలిపాయి. అయితే ప్రతి విదేశీ విద్యార్థి లేదా ఉద్యోగి వీసా ప్ర మాదంలో ఉందని భావించాల్సిన అవసరం లేదని కథనం పేర్కొంది.
కాగా, హెచ్-1బీ, ఎఫ్-1, బీ1/బీ2 వీసాలపై వెళ్లే భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు, పరిశోధకులు, ఇతర వృత్తి నిపుణులపై ప్ర భావం ఎంతన్నది అమెరికా ప్రభుత్వం వెల్లడించలేదు. అందువల్ల రద్దయిన వీసాల్లో అత్యధికంగా భారతీయులే ఉన్నారని చెప్పడం సాధ్యం కాదు. జాతీయత, వీసా కేటగిరీ, కారణాలవారీగా అధికారిక వివరాలు అవసరం.

More Stories
ఆసియా పారా గేమ్స్‌లో మూడో రోజుల్లో 62 పతకాలు
మునీర్ దెబ్బకు పాకిస్థాన్ నుంచి బ్యూరోక్రాట్ల నిష్క్రమణ
ముద్దు పెట్టుకున్నందుకు బంగ్లా జంటకు సౌదీలో ఉరిశిక్ష?