విజయవాడ మేయర్ ఎన్నికలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పోటీలో ఉండగా, వైఎస్సార్సీపీ నుంచి రాయన భాగ్యలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని భావించారంతా. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సైతం రేసులోకి వచ్చారు. ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు. అంతే కాదు ఆయనకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఏబీవీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్.. మేయర్ పోటీ నుంచి తప్పుకుంది.
విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటే బలపరుస్తామని వామపక్షాలు ప్రతిపాదించాయని, తనకు అభ్యంతరమేమీ లేదని చెప్పానని ఏబీవీ తెలిపారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపే విషయమై శనివారం రాత్రి 8 గంటలకి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలనుంచి అంగీకారం వచ్చిందని ఏబీవీ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి మేయర్‌గా ఎన్నుకోవాలని విజయవాడ ఓటర్లను ఆయన అభ్యర్థించారు.
ఏబీ వెంకటేశ్వరరావు మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ద్వారా విజయవాడలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావు విజయవాడతో అనుబంధం ఉంది. ఆయన రెండు పర్యాయాలు విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గానూ ఆయన పని చేశారు.
తాను విజయవాడ మేయర్ అభ్యర్థిగా స్వతంత్రంగా బరిలో నిలుస్తానని పేర్కొంటూ తనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వర రావు శనివారం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు లేఖ రాశారు. తనకు సీపీఐ, సీపీఎంతోపాటు పలు పౌర సంఘాలు తనకు మద్దతు ఇస్తున్నాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ లేఖకు స్పందించిన షర్మిల ఏబీవీ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు.
ఎన్నికల బరిలోకి దిగాలన్న తన నిర్ణయంపై వివరణ ఇస్తూ, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీలు ఫాసిస్ట్ శక్తులుగా తాను అభివర్ణించిన శక్తులతో చేతులు కలుపుతున్నాయని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువలకే ముప్పు కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలు, భిన్నమైన రాజకీయ సంస్కృతి, రాజ్యాంగ నైతికతతో కూడిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ప్రజలకు అందించడం తన పౌర బాధ్యత అని ఆయన అభివర్ణించారు.
ఏబీవీ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ వ్యూహాత్మక రాజకీయాలకు తెరతీసిందని చెప్పొచ్చు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ ఏబీవీ లాంటి వ్యక్తులకు మద్దతు ప్రకటించడం ద్వారా ఓ కొత్త ప్రయోగం చేస్తోందని భావించొచ్చు.

More Stories
అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఎడిబి మరో రూ.15 వేల కోట్ల రుణం
కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తలు.. పులివెందులలో గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
కుప్పం, శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్‌సిగ్నల్