ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అదనపు నిధులు సమకూరే అవకాశం కనిపిస్తోంది. రాజధాని అభివృద్ధి కోసం మరో రూ.15 వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) సానుకూలంగా స్పందించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా చూడటమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.
అమరావతి అభివృద్ధి కోసం ప్రతిపాదించిన అదనపు రుణంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో రూ.7,500 కోట్లు సమకూర్చే అవకాశం ఉందని సమాచారం. ఈ రుణానికి సంబంధించిన ఆమోద ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది. నిధుల విడుదలకు సంబంధించిన షెడ్యూల్, ఇతర నిబంధనలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఈ రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అమరావతి తొలి దశ అభివృద్ధి కార్యక్రమానికి రుణ సహాయాన్ని ఆమోదించాయి.
తాజా ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే రాజధానిలో చేపడుతున్న పనులకు అదనపు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్ఓడీ టవర్లు, వరద నివారణ పనులు, ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ల్యాండ్ పూలింగ్ జోన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 102 పనులకు సుమారు రూ.52,362 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ఈ పనులను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసిఆర్డీఏ), అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలు నిర్వహిస్తున్నాయిరాజధానిలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కృష్ణా నదిపై రెండు వంతెనలు సహా మొత్తం 141 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీటి అంచనా వ్యయం రూ.1,00,912 కోట్లుగా ఉంది. అదనపు రుణ ప్రతిపాదనకు తుది ఆమోదం లభించి, నిధులు అందుబాటులోకి వస్తే అమరావతి నిర్మాణ పనుల పురోగతికి తోడ్పాటు లభించే అవకాశం ఉంది. అయితే రుణ మంజూరు, నిధుల విడుదలకు సంబంధించిన తుది వివరాలు అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతాయి.

More Stories
విజయవాడ మేయర్ రేసులో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు
కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తలు.. పులివెందులలో గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
కుప్పం, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్లకు గ్రీన్సిగ్నల్