దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఒకటిగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లలోని లోపాలపై గతంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చింది. అయితే, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అనేక సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి.
బ్యారేజీ పునాదుల కింద ఉన్న భూగర్భ నిర్మాణం, నదీగర్భ స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించిన తర్వాతే పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యారేజీ కాజ్వే, స్పిల్‌వే ప్రాంతాల్లో బోర్‌హోల్స్ తవ్వాల్సి ఉంది. అయితే, ఈ ప్రక్రియలోనే సమస్యలు ఎదురవుతుండడంతో వచ్చే వానాకాలం నాటికి మూడు బ్యారేజీల మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం కష్టసాధ్యంగానే కనిపిస్తుంది.
మూడు బ్యారేజీల మరమ్మతులకు రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందులో ఒక్క మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకే రూ.700 కోట్లకు పైగా అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరమ్మతుల పనులను ప్రారంభించేందుకు ముందు మూడు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్డీఎస్ఏ సూచించిన మరమ్మతులను వాటి సిఫార్సులకు అనుగుణంగా చేపట్టే అంశంపై మంత్రివర్గం ఇటీవల చర్చించింది. ఇందులో భాగంగా సీడబ్ల్యూపీఆర్ఎస్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, నేషనల్ జియాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులను రంగంలోకి దించింది. మూడు బ్యారేజీల్లో కలిపి సుమారు 500 బోర్‌హోల్స్ తవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మేడిగడ్డలోని 85 గేట్ల వద్ద ఎగువ, దిగువ ప్రాంతాల్లో బోర్‌హోల్స్ తవ్వడంతో పాటు ఎగువ ప్రవాహ ప్రాంతంలోనూ అవసరమైన చోట పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రీన్ఫోర్స్డ్ రాఫ్ట్లకు నష్టం కలగకుండా సుమారు 25 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్ తవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పనులను వేగంగా చేపడితే రాఫ్ట్‌లు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది.
అందువల్ల బోర్‌హోల్స్ తవ్వడం, భూసాంకేతిక పరిశోధనలు పూర్తిచేయడానికే కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థిక భారం, నిర్మాణ సంస్థల వైఖరి, పునాదుల పరిశీలనలో సాంకేతిక అవాంతరాలు కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణను మరింత జటిలం చేస్తున్నాయి. అవసరమైన పరీక్షలు పూర్తయి, లోపాలపై స్పష్టత వచ్చి, పునరుద్ధరణ డిజైన్లు సిద్ధమయ్యే వరకు మరమ్మతుల పనులు వేగం పుంజుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Stories
యాదాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు కేటాయింపు.. కేంద్రం పూర్తి అండ
తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటులో మహిళా మోర్చా కీలక పాత్ర
టెండర్లు, బిల్లులు పొందాలంటే సీఎంకు 15 శాతం కమీషన్