తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 కింద రూ.129.85 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.
భోలే బాబా ఆర్గానిక్ డెయిరీమిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, వాటి ప్రమోటర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వారి కుటుంబ సభ్యులు, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్ కైలాశ్ చంద్ మంగ్లా, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర సంబంధిత వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం వెల్లడించింది.
ఈ కేసులో భోలే బాబా ఆర్గానిక్ డెయిరీమిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ విపిన్ జైన్, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్, డైరెక్టర్ కైలాశ్ చంద్ మంగ్లాలను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ కేసులో, పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద గతంలో స్వాధీనం చేసుకున్న, స్తంభింపజేసిన ఆస్తులతో పాటు, తాజాగా జప్తు చేసిన రూ.129.85 కోట్ల విలువైన ఆస్తులను కలుపుకుని, ఇప్పటివరకు మొత్తం రూ.132.55 కోట్ల విలువైన ఆస్తులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు నేరపూరిత కుట్ర, మోసం, నకిలీ పత్రాల సృష్టి, అవినీతికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపణలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సంబంధిత దర్యాప్తు సంస్థ నెల్లూరులోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్షీట్, అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడం ద్వారా టీటీడీని మోసం చేయడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పు కలిగించి, భారీగా అక్రమ లాభాలు ఆర్జించినట్లు అందులో పేర్కొంది.
టీటీడీకి నేరుగా, మధ్యవర్తి డైరీల ద్వారా మొత్తం రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని ‘భోలే బాబా’ సంస్థ సరఫరా చేసిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. టిటిడి టెండర్లలో తమ సొంత పేర్లతో పాల్గొన్న కొన్ని డైరీలు, కమిషన్ కోసం మధ్యవర్తులుగా వ్యవహరించాయని దర్యాప్తు సంస్థ గుర్తించింది.
ఈ నకిలీ కొనుగోళ్ల కోసం బ్యాంకింగ్ మార్గాల ద్వారా చెల్లించిన మొత్తాలను హవాలా మార్గాల ద్వారా నగదు రూపంలో తిరిగి రాబట్టుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నగదును నకిలీ పామాయిల్ కొనుగోలుదారులకు చెల్లింపులు చేయడానికి, మధ్యవర్తి డెయిరీలకు కమీషన్లు చెల్లించడానికి, ఈ ప్లాన్లో పాలుపంచుకున్న ఇతర వ్యక్తులకు ప్రతిఫలాలు అందించడానికి ఉపయోగించినట్లు ఈడీ వెల్లడించింది.

More Stories
గుర్తింపు అడిగినందుకు బెంగుళూరు పబ్ లో ఏపీ ఐఏఎస్ దూషణలు!
14,15తేదీల్లో విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఏపీలో స్థానిక సమరానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్