14,15తేదీల్లో విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 14,15తేదీల్లో విజయవాడ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.  రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఇందుకు సంబంధించి రాష్ట్రపతి సచివాలయం నుండి జారీ అయన మార్గదర్శకాలను తుచ:తప్పక పాటించాలని స్పష్టం చేశారు.  ముఖ్యంగా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా సమయపాలనకు అనుగుణంగా జరిగేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు.

రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామల రావు మాట్లాడుతూ భారత రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీ వివరాలను తెలియజేశారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించి డ్రాప్టు ముసాయిదా ప్రయాణ సమాచారం ప్రకారం ఈనెల 14వతేదీ మధ్యాహ్నం 3.55 గం.లకు రాష్ట్రపతి ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి సా.6.25 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. 
 
రాత్రి 7.20 నుండి 7.40 గంటల వరకు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాత్రికి విజయవాడలో బస చేస్తారు.15వతేది ఉదయం 11.30 గంగలకు పున్నమి ఘాట్ చేరుకుని ఉ.11.30గంటల నుండి మధ్యాహ్నం 1గంటల వరకూ అక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళాలో ముఖ్య అతిధిగా పాల్గొంటారు.
 
తదుపరి మధ్యాహ్నం 1.20 నుండి 2.10 గంటల వరకు స్వయం సహాయక సంఘాలు-లాక్పతి దిదిలతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి మధ్యాహ్నం 2.45 గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళతారు.  ఈ వర్చువల్ సమావేశంలో అదనపు డిజిపి మదుసూదన్ రెడ్డి, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, సెర్ప్ సిఇఓ కరుణ, ఎన్టిఆర్ జిల్లా కలక్టర్ లక్ష్మిషా, ఐఅండ్పిఆర్ డైరెక్టర్ కెఎస్.విశ్వనాధన్, దుర్గగుడి ఇఓ శీనూనాయక్, ప్రోటోకాల్ విభాగం జెస్.రామసుబ్బయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author