రాజ్యాంగాన్ని కాపాడతామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని, ప్రతిపక్షాల గొంతుకను గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ పదేపదే చెబుతోంది. కానీ ఢిల్లీలో ఆ పార్టీ చెబుతున్న మాటలకు, తెలంగాణలో వారి ప్రభుత్వం చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన కనిపించడం లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి ఢిల్లీలో, హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం అని తెలిపారు.
గత 3,4 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల కారణంగా.. ప్రజలకు అసౌకర్యం కలిగినా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా వారికి నిరసన తెలిపే అవకాశాన్ని అనేకసార్లు ఢిల్లీ పోలీసులు కల్పించారని ఆయన గుర్తు చేశారు. ప్రియాంక గాంధీ రోడ్డుపై పడుకున్నా, బారికేడ్లపైకి ఎక్కి జుగుప్సాకరంగా రాహుల్ వ్యవహరించినా.. వారి భావప్రకటన స్వేచ్ఛను పోలీసులు, ప్రభుత్వం గౌరవించాయని చెప్పారు.
రాహుల్ గాంధీ దేశమంతా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని, ప్రధాని మోదీపైన, కేంద్ర ప్రభుత్వంపైన తప్పుడు ఆరోపణలు, పచ్చి అబద్ధాలతో తీవ్రంగా విమర్శిస్తున్నారని, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, భారత సైన్యం వంటి సంస్థలపైనా ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. వారు అబద్ధాలు ప్రచారం చేసినా.. రాజకీయంగా ఆయన మాట్లాడే హక్కును అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏనాడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు.
అంతేకాదు, రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించి, లోక్ భవన్ ముందు బైఠాయించారని, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపట్టేందుకు శాంతిభద్రతలు అడ్డురావా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మరి ఢిల్లీలో కాంగ్రెస్‌కు కావాల్సిన ప్రజాస్వామ్య హక్కులు తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఉండకూడదు? బీజేపీ నాయకులు ప్రజల సమస్యలపై నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి శాంతిభద్రతల సమస్యలన్నీ గుర్తుకొస్తాయా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని కేంద్ర మంత్రి నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినా, కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోవడం లేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అనేకసార్లు గృహనిర్బంధం చేస్తూ, గొంతు నొక్కేస్తోందని ఆయన మండిపడ్డారు.

More Stories
మెదక్ జిల్లాలో వెలుగులోకి 1,100 ఏళ్ల నాటి గజలక్ష్మి శిల్పం
300 మంది కెనడా వాణిజ్యవేత్తలు బృందం భారత్ లో పర్యటన
రియాద్ విమానాశ్రయంపై హౌతీ క్షిపణి దాడి, 14 మంది మృతి