300 మంది కెనడా వాణిజ్యవేత్తలు బృందం భారత్ లో పర్యటన

 
* కెనడా- భారత్ సంబంధాల్లో భారీ ముందడుగు
 
జస్టిన్ ట్రూడో హయాంలో క్షీణించిన కెనడా-భారత్ సంబంధాలు మళ్లీ గాడినపడుతున్నాయి. ఖలిస్థాన్ వేర్పాటువాదం, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంపై ప్రధాని ట్రూడో 2023లో కెనడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందనడానికి విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారి తీసింది. 
 
ఇరు దేశాలు పరస్పరం సీనియర్ దౌత్యవేత్తలు, రాయబారులను తమ దేశం నుంచి బహిష్కరించాయి. ఖలిస్థాన్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, కెనడా గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, హింసాత్మక ఘటనలపై ఆ దేశం చర్యలు తీసుకోకపోవడం పట్ల అప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత్ కెనడా పౌరులకు కొంత కాలంపాటు వీసాలను కూడా నిలిపేసింది. 
 
కెనడా అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆ దేశ విచారణ సంస్థలు ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. కెనడాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. అయితే జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ట్రూడో హయాంలో భారత్ లో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడానికి కొత్త ప్రభుత్వం వేగంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. 
 
దీంతో ఇరు దేశాలు హైకమిషనర్లను రాయబార కార్యాలయాలకు పంపించాయి. ఈ ఏడాది ఆరంభంలో కెనడా ప్రధాని కార్నీ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. భారత్-కెనడా మధ్య దెబ్బతిన్న వాణిజ్యాన్ని పునరుద్ధరించడం కోసం సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఈపీఎ) చర్చలను తిరిగి ప్రారంభించారు.   ఈ క్రమంలోనే కెనడా నుంచి 300 మంది వాణిజ్యవేత్తల బృందం అక్టోబర్ 12-17 తేదీల మధ్య భారత్‌లో పర్యటించనుంది.
కెనడా వాణిజ్య మంత్రి  మణిందర్ సిద్ధు నేతృత్వంలో వీరు భారత్‌కు రానున్నారు. వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చడం, ఇరు దేశాల మధ్య కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించడంపై ఈ పర్యటనలో ఫోకస్ చేయనున్నారు. తమ వాణిజ్యవేత్తల బృందం ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనుందని కెనడా ప్రభుత్వం ప్రకటించింది.
2030 నాటికి భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 70 బిలియన్ డాలర్లకు రెట్టింపు కంటే ఎక్కువగా పెంచాలని కెనడా లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరింపచేసుకుంది.
 
భారత చట్టసభ్యులు, పారిశ్రామిక వర్గాలు, తదితరులను కలిసి.. వాణిజ్యం, వ్యాపార భాగస్వామ్యం గురించి చర్చించనున్నారు. అయితే కెనడా నుంచి ఇంత పెద్ద వాణిజ్య బృందం భారత పర్యటనకు రానుండటం.. గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఏరోస్పేస్, స్పేస్, క్లీన్ టెక్నాలజీ, ఎనర్జీ ట్రాన్సిషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, అగ్రి-ఫుడ్ తదితర రంగాలకు చెందిన వారు ఈ బృందంలో ఉన్నారు.

2026 డిసెంబర్ నాటికి భారత్‌తో కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (సిఈపీఎ)ను ఫైనలైజ్ చేయాలని కెనడా భావిస్తోంది. పౌర అవసరాల కోసం భారత్‌కు యురేనియం సరఫరా చేయడానికి కెనడా సంస్థ కామెకో ఒప్పందం చేసుకుంది. మొత్తానికి భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు తగ్గి సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. అయితే భద్రత, ఉగ్రవాద నిరోధక అంశాలపై ఇరుదేశాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

About The Author