జిడిపి 6.6 శాతం నుంచి 7.1 శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు

భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ బ్యాంకు సానుకూల అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.1 శాతం వృద్ధి చెందవచ్చని పేర్కొంది. గత ఏప్రిల్‌లో అంచనా వేసిన 6.6 శాతంతో పోలిస్తే తాజా అంచనాను 0.5 శాతం పాయింట్లు పెంచింది. అంచనాలకు మించిన ఆర్థిక కార్యకలాపాలు, బలమైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులే ఈ పెంపునకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. 
 
తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఊహించిన దానికంటే మెరుగైన ఈ గణాంకం ప్రపంచ బ్యాంకు తాజా అంచనాలకు దోహదపడింది. దేశీయ డిమాండ్‌ బలంగా ఉండటంతో పాటు పెట్టుబడులు కూడా వృద్ధికి మద్దతుగా నిలిచాయని తెలిపింది. రానున్న కాలంలోనూ ప్రైవేటు వినియోగం ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకంగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 
 
ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు, విధానపరమైన మద్దతు కూడా వృద్ధికి బలం చేకూర్చనున్నాయని పేర్కొంది. మరోవైపు భారత ఎగుమతులు అంచనాల కంటే మెరుగ్గా కొనసాగుతున్నాయని తెలిపింది. ఇవి వృద్ధి అంచనాలకు మరింత సానుకూలతను అందించే అవకాశం ఉందని పేర్కొంది.  అయితే ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రైవేటు పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించింది.
సరఫరా వైపు చూస్తే పారిశ్రామిక కార్యకలాపాలు అంచనాలను అధిగమించాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. మౌలిక వసతులు, నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువుల ఉత్పత్తితో పాటు విద్యుత్‌ ఉత్పత్తిలోనూ బలమైన వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాల సమయంలో వర్షపాతం లోటు వ్యవసాయ రంగ అవకాశాలపై ప్రభావం చూపినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల వినియోగ డిమాండ్‌పై స్వల్పంగా పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
సేవల రంగం గత ఏడాది నమోదైన అధిక వృద్ధితో పోలిస్తే కొంత మందగించినప్పటికీ, ఇప్పటికీ బలమైన స్థాయిలోనే కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మొత్తంగా చూస్తే దేశీయ వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుండటంతో భారత వృద్ధిపై ప్రపంచ బ్యాంకు తన అంచనాను పెంచింది.

About The Author