భారత్-అమెరికాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయని పేర్కొంటూ ఇరు దేశాలు ఇప్పటికే పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపాయని, ప్రస్తుత స్థాయి నుంచి మరిన్ని రాయితీలు ఇవ్వడం లేదా తీసుకోవడం చాలా కష్టంగా మారవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు.
సోమవారం జరిగిన మ్యూనిక్ లీడర్స్ మీటింగ్‌లో ఆమె ప్రసంగిస్తూ చర్చలు ఒక స్థాయికి చేరుకున్నాయని, అంతకుమించి ఇచ్చిపుచ్చుకోవడం చాలా కష్టమవుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే ఏ మాత్రం అవకాశం ఉన్నా చర్చలు కొనసాగించడానికి ఇరు పక్షాలూ సిద్ధంగా ఉన్నాయని ఆమె చెప్పారు. ఇరు దేశాలు తమ తమ పరిమితులకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు.
కొత్తగా రాజీకి లేదా ముందడుగుకు అవకాశం కనిపిస్తే ఇరు పక్షాలు దానిని పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారత్‌తో వాణిజ్యంలో అమెరికాకు ఉన్న లోటు ప్రస్తుత చర్చల్లో కీలక అంశంగా మారిందని సీతారామన్ వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతుల్యత తమకు అనుకూలంగా లేదని అమెరికా భావిస్తోందని, ఈ లోటును తగ్గించుకోవాలని వాషింగ్టన్ కోరుకుంటోందని చెప్పారు.
భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, దాన్ని పూడ్చుకోవడంపైనే ఆ దేశం దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు. ఇందుకు సంప్రదాయ చర్చల మార్గాన్ని కాకుండా ’టారిఫ్‘లను ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తోందని చెప్పారు. టారిఫ్‌లను పెంచడం ద్వారా వాణిజ్యలోటును భర్తీ చేసుకోవాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. గతంలో వాణిజ్య అసమతుల్యతలను మార్కెట్ యాక్సెస్, పరస్పర రాయితీలు, చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు జరిగేవని ఆమె పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం సుంకాలను కూడా వాణిజ్య అసమతుల్యతలను ఎదుర్కొనే సాధనంగా ఉపయోగిస్తున్న పరిస్థితి ఉందని వివరించారు. సాంప్రదాయ విధానం నుంచి అమెరికా మళ్లిందని ఆమె అభిప్రాయపడ్డారు. వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడంపైనే చర్చల్లో అమెరికా దృష్టి పెడుతోందని, ఇంతవరకు జరిగిన లోటును ఏదోవిధంగా పూడ్చుకోవాలని భావిస్తోందని వివరించారు.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా ఉండి, దిగుమతులు తక్కువగా ఉన్నాయి.ఈ కారణంగా అమెరికాకు వాణిజ్య లోటు ఏర్పడడంతో ఆ అంశంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది. కేవలం వాణిజ్యపర అంశాలకు పరిమితం కాకుండా, వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో చర్చలు సంక్లిష్టంగా మారాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా కాకుండా టారిఫ్‌లు విధించడం ద్వారా లోటును భర్తీ చేసుకోవాలని ఆలోచిస్తోందని ఆమె చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరలాంటే సరఫరాల గొలుసుకు నష్టం కలగకూడదని ఆమె చెప్పారు. ఆ గొలుసుకు ఏ చిన్న విఘాతం కలిగినా కొత్త భాగస్వామిని ఎంచుకొని సరఫరాలకు ఆటంకాలు కలగకుండా చూసుకుంటారని ఆమె తెలిపారు. ప్రపంచంలో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నందున దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకువెళ్లాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు.
అయితే వ్యవసాయం, డెయిరీ, తయారీ వంటి సున్నితమైన దేశీయ రంగాల విషయంలో ఇరు దేశాల ప్రయోజనాలను సమన్వయం చేయడం సవాలుగా మారింది. దిగుమతి సుంకాలు, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాల్లో ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉందని తెలుస్తోంది. దేశీయ రైతులు, పరిశ్రమల ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఎగుమతులకు అవకాశాలను పెంచేలా ఒప్పందాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సీతారామన్ పేర్కొన్నారు.
వస్త్రాలు, పాదరక్షలు, బొమ్మలు, ప్రాసెస్డ్ మెటీరియల్స్ వంటి అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రంగాలకు విదేశీ మార్కెట్లలో మెరుగైన అవకాశాలు లభిస్తే ఎగుమతులు, ఉపాధి పెరిగే అవకాశం ఉంటుందని సీతారామన్ వివరించారు. అదే సమయంలో వ్యవసాయం, డెయిరీ వంటి దేశీయంగా సున్నితమైన రంగాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. వివిధ రంగాల సున్నిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్లవచ్చని చెప్పారు.
భారత్, అమెరికా మధ్య విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు 2025లో ప్రారంభమయ్యాయి. 2026 ఫిబ్రవరిలో ఇరు దేశాలు సుంకాల తగ్గింపు, మార్కెట్ ప్రాప్యత, వాణిజ్యేతర అడ్డంకుల పరిష్కారం, సరఫరా గొలుసుల సహకారం వంటి అంశాలతో కూడిన మధ్యంతర వాణిజ్య ఫ్రేమ్‌వర్క్‌పై పని చేయడానికి అంగీకరించాయి. అయితే విస్తృత వాణిజ్య ఒప్పందంలో ఇంకా కొన్ని కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య అంశాలపై చర్చించారు.
అయితే, భారత్-అమెరికా వాణిజ్య చర్చలు అధికారికంగా నిలిచిపోలేదని సీతారామన్ స్పష్టం చేశారు. అయితే తదుపరి దశకు వెళ్లేందుకు అవసరమైన అదనపు రాయితీల విషయంలో ఇరు దేశాలకూ పరిమితులు ఎదురవుతున్నాయని ఆమె వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. కొత్తగా చర్చించగల అంశాలు లేదా రాజీకి అవకాశం ఏర్పడితే చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, అమెరికా సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. తుది వాణిజ్య ఒప్పందం ఎప్పుడు ఖరారవుతుందనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.
More Stories
ఫారం-6లో ఒక్క కామా లేదా ఫుల్ స్టాప్‌ను కూడా మార్చలేదు
జ్ఞానేశ్ అధికార దుర్వినియోగం, రాహుల్ ఆరోపణలు అబద్ధం.. బిజెపి
ఈశాన్య ప్రాంతంలో సంఘ్ పాత్రపై అవగాహన కలిగించే గ్రంధం