ఈశాన్య ప్రాంతంలో సంఘ్ పాత్రపై అవగాహన కలిగించే గ్రంధం 

నవ ఠాకూరియా 

సెప్టెంబర్ 26, 2026న గౌహతిలో ఒక ఆసక్తికరమైన, ఆలోచింపజేసే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనేకమంది ప్రముఖుల సమక్షంలో పరిశోధన ఆధారిత పుస్తకంను ఆవిష్కరించారు.  ప్రఖ్యాత రచయిత అభిజిత్ జోగ్ రాసిన “గ్రిట్ & గ్లోరీ : హౌ ఇండియాస్ నార్త్ ఈస్ట్ వజ్ ట్రాన్సఫార్మేడ్ వన్ హార్ట్ అటు ఆ టైమ్” అనే ఈ పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ బోరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సీనియర్ కార్యకర్తలు, పౌర సమాజ ప్రతినిధులు హాజరయ్యారు.

గౌహతికి చెందిన ‘ప్రాచి ప్రకాశన్’ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇద్దరు సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులు హరిభావు మిరాస్దార్, ఉల్హాస్ కులకర్ణి ప్రసంగించగా, ఈ వ్యాస రచయిత అధ్యక్షత వహించారు. న్యూఢిల్లీకి చెందిన ‘సురుచి ప్రకాశన్’ ప్రచురించిన ఈ పుస్తకం, దశాబ్దాల క్రితం ఈశాన్య భారతదేశానికి వచ్చి భారీ సవాళ్లను ఎదుర్కొన్న, కొందరు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుల అనేక గాథలను వివరిస్తుంది.

1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన ‘సంఘ్’ గురించి, వైవిధ్యభరితమైన ఈ ప్రాంతంలోని సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం ఒక క్లిష్టమైన పనిగా ఉండేది. సుమారు 175 మంది మాజీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులు, ‘రాష్ట్ర సేవికా సమితి’ స్వచ్ఛంద కార్యకర్తలతో జరిపిన వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందిన ఈ పుస్తకం, ఆ ప్రాంత నాగరికత, సంస్కృతి, చరిత్రను పునఃపరిశీలించేందుకు ఆ జాతీయవాద సంస్థ చేసిన కృషిని తెలియజేస్తుంది. 

అలాగే, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన తూర్పు పాకిస్థాన్/బంగ్లాదేశ్ నుండి చొరబాట్ల సమస్యను కూడా ఇది ప్రస్తావిస్తుంది. రూ. 499 ధర కలిగిన ఈ 300 పేజీల పుస్తకం, ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న సామాజిక-రాజకీయ, ఆర్థిక మార్పులను కూడా వివరిస్తుంది. ప్రారంభ రోజుల్లో అనేక స్థానిక సంస్థల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పడిన ఇబ్బందులను బోరా తన ప్రసంగంలో వివరించారు. 

కొన్ని సందర్భాల్లో సవాళ్లు ఎంత తీవ్రంగా ఉండేవంటే, పలువురు ప్రచారకులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. స్థానిక సంప్రదాయాలను పరిరక్షించడంలోనూ, అలాగే ఈ ప్రాంతంలో చొరబాటు, మత మార్పిడి వంటి తీవ్రమైన సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలోనూ ఆర్‌ఎస్‌ఎస్ చేసిన కృషిని ఆ పదవీ విరమణ చేసిన అధికారి గుర్తించారు. దేశంలోని ఈ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు 1946లో గౌహతిలో ప్రారంభమయ్యాయని మిరాస్‌దార్ తెలిపారు.

ప్రారంభ సంవత్సరాల్లో దీని విస్తరణ చాలా నెమ్మదిగా సాగినప్పటికీ, తర్వాతి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తి ఈ ప్రాంతంలోని వివిధ భాగాలకు వ్యాపించింది. ఒకప్పుడు అశాంతిని కలిగించే కార్యకలాపాలు, హింసాత్మక ఆందోళనలకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేదని, కానీ ఇటీవలి కాలంలో ఇది అభివృద్ధి, సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలు వృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారిందని ఆయన పేర్కొన్నారు. 

సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కులకర్ణి ఒక విషయాన్ని స్పష్టం చేశారు: ఈ పుస్తకం అస్సాం గురించిన సమగ్ర చరిత్ర గానీ లేదా ఆ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ ఉనికికి సంబంధించిన వివరణ గానీ కాదు; ఇది ‘భారతీయత్వ’ స్ఫూర్తి కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు అర్పించిన ఒక ప్రత్యేక నివాళి. అస్సాం ఉద్యమానికి (1979-1985) ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇచ్చినప్పటికీ, సమాజంలోని ఒక పెద్ద వర్గంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుల పట్ల కొంత వ్యతిరేకత లేదా ద్వేషం కనిపించేదని ఆయన గుర్తుచేశారు.

ఇటీవలి కాలంలో మారుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూనే, 15వ శతాబ్దపు సాధువు, తత్వవేత్త, అస్సాం భక్తి ఉద్యమ దిగ్గజం అయిన మహాపురుష్ శ్రీమంత శంకరదేవ రచించిన పద్యాలను ఉదహరించి కులకర్ణి సభికులను ఆకట్టుకున్నారు. జాతీయ సమైక్యత కోసం ఈ ప్రాంతంలో తమ ప్రాణాలను అర్పించిన శాంతికాలి మహారాజ్, మధుమంగళ శర్మ, మురళీ మనోహర్, ఓంప్రకాష్ చతుర్వేది, రిజోయ్‌సింగ్ ఖోంగ్‌షా, ప్రమోద్ దీక్షిత్, శ్యామల్‌కాంతి సేన్‌గుప్తా, దినేంద్రనాథ్ డే, సుధామయ్ దత్, శుభంకర్ చక్రవర్తి, శుక్లేశ్వర్ మేధి, ఇతర అమరవీరుల స్మృత్యర్థం ఈ పుస్తకంను అంకితం చేశారు. 

ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఇలా పేర్కొన్నారు: “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితికి చెందిన అనేకమంది యువ కార్యకర్తలు అంకితభావం, దృఢ సంకల్పంతో భారతదేశపు ఈశాన్య ప్రాంతాన్ని ఎలా మార్చారో తెలిపే స్ఫూర్తిదాయకమైన చిత్రణే ఈ పుస్తకం. ఇది భారత యువతలో కూడా అటువంటి దృఢ సంకల్పాన్ని, అంకితభావాన్ని పెంపొందిస్తుంది. తద్వారా మన పవిత్ర మాతృభూమి సమస్త మానవాళి శ్రేయస్సు కోసం అత్యున్నత వైభవాన్ని పొందుతుంది.”

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముందుమాటతో పంపిన ఈ పుస్తకం, సంక్లిష్టమైన సామాజిక-సాంస్కృతిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్న ఈ భూపరివేష్టిత ప్రాంతానికి, మిగతా భారతదేశానికి మధ్య వారధిగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం కూడా ఒకప్పుడు ధైర్యసాహసాలతో కూడుకున్న చర్యగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. 

“భయం, అనిశ్చితి రోజువారీ జీవితాన్ని కమ్మేశాయి. తిరుగుబాటు, అపనమ్మకం, ఏకాంతం ఆ ప్రాంతపు కథనాన్ని నిర్వచించాయి. ఇవి వినడానికి సౌకర్యవంతమైన నిజాలు కావు, కానీ జరిగిన పరివర్తన యొక్క పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి అవసరం. ఈ పరివర్తనను సాధించిన తీరే దానిని విశేషమైనదిగా నిలుపుతుంది,” అని గడ్కరీ  తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ పుస్తకంలో ఇలాంటి అభిప్రాయాలనే ప్రతిధ్వనించారు.

అరుణాచల్ ప్రదేశ్ నివాసి అయిన రిజిజు, ఈశాన్య ప్రాంతంలో ఒకప్పుడు వేర్పాటువాద భావన ప్రమాదకర స్థాయికి చేరిన విషయాన్ని ప్రస్తావించారు. “ప్రేమ, స్నేహం, సేవ, అభివృద్ధి ద్వారా ఆ పరిస్థితి ఎలా మారిందన్నది ఒక ఆసక్తికరమైన కథ. ఆ ప్రాంత నివాసిగా, నేను దానిని స్వయంగా అనుభవించాను. దేశమంతా చదివి గర్వపడేలా ఈ పుస్తకం ఆ విషయాన్ని వివరించడం నాకు సంతోషాన్నిస్తోంది,” అని ఆయన చెప్పారు. 

అధ్యక్షత వహిస్తూ, ఈశాన్య ప్రాంతానికి, భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు ఉన్న సవాళ్లు, అవకాశాలను ఒకే దృక్పథంతో అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను నేను నొక్కి చెప్పాను. కార్యక్రమ ప్రారంభంలో, ప్రముఖ అతిథులు ‘భారత మాత’ చిత్రపటం ముందు పుష్పాంజలి సమర్పించారు. నబమితా దేబ్ కార్యక్రమాన్ని నిర్వహించగా, రీతా భుయాన్ ‘బోర్‌గీత్’ ప్రదర్శన ఇచ్చారు. హిరక్ శర్మ వందన సమర్పణ చేశారు. భారతదేశ జాతీయ గీతం ‘వందేమాతరం’ పూర్తి పాఠాన్ని ఆలపించడంతో కార్యక్రమం ముగిసింది.

About The Author