రష్యా, ఉక్రెయిన్లతో భారత్ నేరుగా శాంతి చర్చలు 

ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ఇన్నాళ్లూ యుద్ధానికి ముగింపు పలకాలని, చర్చలు-దౌత్యం ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని చెబుతూ వచ్చిన భారత్‌ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌తో నేరుగా మాట్లాడుతోంది. న్యూడిల్లీలో జరిగిన మ్యూనిక్‌ లీడర్స్‌ మీటింగ్​లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై భారత్‌ మొదటి నుంచీ ఒకే వైఖరితో ఉందని చెప్పారు. 

“ఇన్నాళ్లూ మేం శాంతి కోసం వాదిస్తూ వచ్చాం. అయితే ఇటీవలి నెలల్లో దానికి మించి కొంత ఎక్కువగా మేం భాగస్వాములమయ్యాం. రష్యా, ఉక్రెయిన్‌ రెండింటితోనూ మాట్లాడుతున్నాం” అని జైశంకర్‌ చెప్పారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వెంటనే పరిష్కరించగల అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇందులో మొదటగా బ్లాక్‌ సీలో నౌకల రాకపోకలకు భద్రత కల్పించే అంశాన్ని భారత్‌ తీసుకున్నట్లు జైశంకర్‌ చెప్పారు.

ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం ఎగుమతులు, ఇంధన సరఫరా వంటి అంశాలపైనా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఒకరిపై ఒకరు దాడులు చేయకుండా ఉండే అవకాశాలపైనా చర్చిస్తున్నట్లు వెల్లడించారు. అంటే యుద్ధాన్ని ఒక్కసారిగా ఆపేయాలనే పెద్ద లక్ష్యంతో మాత్రమే కాకుండా, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని తక్షణ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగానూ భారత్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు జైశంకర్‌ మాటలను బట్టి అర్థమవుతోంది.

ఈ పరిణామాలకు కొద్ది రోజుల ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధానికి పరిష్కారం కనుగొనే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి మంచి ఆలోచనలు ఉన్నాయని  చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకాలని మోదీ ప్రతి సమావేశంలోనూ ప్రస్తావిస్తుంటారని తెలిపారు. పరస్పరం అంగీకరించగల పరిష్కారం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారని పుతిన్‌ పేర్కొన్నారు. 

అంతేకాదు, ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా కూడా భారత్‌ ప్రతిపాదనపై ఇటీవల స్పందించారు. కాల్పుల విరమణకు సంబంధించి తమకు భారత్‌తో పాటు టర్కీ, ఈజిప్ట్‌, అమెరికా నుంచి ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. వీటిలో భారత్‌ ప్రతిపాదన విస్తృతమైనదిగా ఉందని ఆయన పేర్కొన్నారు. బ్లాక్‌ సీ, ఇంధన మౌలిక వసతులకు సంబంధించిన అంశాలపై కాల్పుల విరమణను పరిశీలించేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉందని తెలిపారు.

About The Author