బలమైన సామాజిక, ఆర్థిక పునాదుల మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు, మాజీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడలేదని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ ముఖ్యంగా రుణభారం జీఎస్డీపీలో దాదాపు 35 శాతానికి చేరడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సామాజిక సంక్షేమం, పెన్షన్లు, ఆరోగ్యం, విద్య తదితర రంగాలకు ప్రభుత్వం గణనీయంగా ఖర్చు చేస్తోంది. అసలు చర్చ సంక్షేమ వ్యయాన్ని కొనసాగిస్తూనే ఆదాయం సృష్టించే పెట్టుబడులకు ఎంత స్థలం మిగులుతోంది? అన్నదానిపైనే చర్చ. కేరళ ప్రభుత్వ అధికారిక 2025-26 బడ్జెట్ పత్రాల ప్రకారం, మొత్తం రుణ నిల్వ జీఎస్డీపీలో 33.77 శాతంగా అంచనా వేశారు.
2022-23లో ఇది 35.38 శాతంగా ఉండగా, 2023-24లో 34.20 శాతం, 2024-25లో సుమారు 34.22 శాతంగా నమోదైంది. కేరళ బడ్జెట్ చూస్తే చంద్రశేఖర్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ రుణభారం సుమారు 35 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఆయన దృష్టిలో ప్రధాన సమస్య అప్పు తీసుకోవడమే కాదు, ఆ అప్పును ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామన్నదే కీలకం.
అభివృద్ధి ప్రాజెక్టులు, భవిష్యత్‌లో ఆదాయం తెచ్చే పెట్టుబడుల కోసం అప్పు తీసుకుంటే అది ఆర్థికంగా సమర్థించదగినదే. కానీ జీతాలు, రోజువారీ నిర్వహణ ఖర్చులు, తిరిగి ఆదాయం రాని వ్యయాల కోసం రుణాలను వినియోగిస్తే భవిష్యత్‌లో రుణభారం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రెండూ ఒకటే కావు అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
చంద్రశేఖర్ కేరళ మూలధన వ్యయం తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పేర్కొన్న లెక్కల ప్రకారం కేరళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జీఎస్డీపీలో 1.34 శాతంగా ఉండగా, అన్ని రాష్ట్రాల సగటు 3.01 శాతంగా ఉంది. కేరళ అధికారిక ఆర్థిక సమీక్షలో 2024-25లో మొత్తం మూలధన వ్యయం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 8.96 శాతం పెరిగినట్లు పేర్కొంది.
చదువుకున్న యువత అధికంగా ఉన్న రాష్ట్రంగా కేరళకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ వారికి తగినంత స్థానిక ఉపాధి కల్పించడం మాత్రం సవాలుగానే ఉంది. చంద్రశేఖర్ కేరళ నిరుద్యోగితపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు పెరగాలంటే ప్రైవేటు పెట్టుబడులు, తయారీ, ఐటీ, పర్యాటకం, కొత్త సేవల రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

More Stories
టర్కీ నుండి రప్పించిన నార్కోటిక్ కింగ్‌పిన్ నవ్‌ప్రీత్ సింగ్
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠ
సెప్టెంబర్‌లోనూ 24 బిలియన్లు దాటిన యూపీఐ చెల్లింపులు