‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ వంటి అజరామర చిత్రాల సృష్టికర్త ఇక లేరు. భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు పెద్దపీట వేసి, సంప్రదాయ మేకింగ్ పద్ధతులకు భిన్నంగా దర్శకత్వానికి సరికొత్త బాటలు చూపిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నాలుగు నెలల క్రితం అంటే తన 94వ ఏట కూడా కెమెరా ముందుకు వచ్చి ‘సింగ్ గీతం’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. తద్వారా సినిమాపై తనకున్న అంతులేని తపనను చాటుకున్నారు. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి ఆయన సినిమాలకు స్క్రిప్ట్ వర్క్‌లో సహాయం చేస్తూ, వ్యక్తిగత జీవితంలోనూ వెన్నంటి నిలిచారు. ఆమె 2022లో చెన్నైలో కన్నుమూశారు. భార్య జ్ఞాపకార్థం సింగీతం శ్రీనివాసరావు ‘శ్రీకళాణీయం’ అనే పుస్తకాన్ని కూడా రచించారు.
సింగీతం శ్రీనివాసరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి. ఆయన 1931 సెప్టెంబరు 21న జన్మించారు. తండ్రి రామచంద్రరావు ప్రధానోపాధ్యాయులుగా పని చేయగా, తల్లి శకుంతలాబాయి వాయులీన విద్వాంసురాలు. చిన్నతనంలోనే పాఠశాలలో ప్రదర్శించిన ‘లవకుశ’ నాటకంలో లవుని పాత్ర పోషించడం ద్వారా ఆయనకు నటనపై మక్కువ ఏర్పడింది.
చెన్నైలో చదవుకుంటున్న రోజుల్లో ప్రముఖ కవి, నాటకకర్త హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ మార్గదర్శకత్వంలో నాటకరంగంలో పూర్తిస్థాయిలో ప్రవేశించారు. అదే సమయంలో హాలీవుడ్ సినిమాలను సైతం విరివిగా చూస్తూ సినిమా నిర్మాణ మెలకువలపై ఆసక్తిని పెంచుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం కొంతకాలం సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా సేవలందించారు.
ఆ సమయంలో తానే స్వయంగా కొన్ని నాటకాలను రచించి, వాటిని తన విద్యార్థుల చేత ప్రదర్శింపజేసేవారు. ఆ తర్వాత కాలంలో భారతీయ చలనచిత్ర చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిన ‘మాయాబజార్’ (1957) చిత్రానికి దిగ్గజ దర్శకుడు కె.వి. రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దిగ్గజ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు వద్ద శిష్యరికం చేసిన అనుభవమే, ఆయన తదుపరి కాలంలో ఎన్నో అద్భుతమైన మ్యూజికల్ చిత్రాలను తెరకెక్కించడానికి ప్రధాన కారణమైంది.
ఆ తర్వాత దర్శకుడిగా మారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో సినిమాలు తీశారు. రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఐదు నంది అవార్డులు, కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్ సహా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన్ను వరించాయి. ముఖ్యంగా ‘పుష్పక విమానం’లో సంభాషణలు లేకుండా కథను నడిపించడం, ‘ఆదిత్య 369’లో టైమ్ ట్రావెల్ అంశాన్ని చూపించడం ఆయన ప్రయోగాత్మక దృక్పథానికి నిదర్శనాలుగా నిలిచాయి.

More Stories
రాయలసీమను రతనాల సీమగా మార్చే హార్టికల్చర్ హబ్
స్వచ్ఛ భారత్ అంతరాత్మకు సంబంధించిన అంశం
ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ జీవోల రద్దు