బంగ్లాదేశ్‌కు అక్రమ రవాణాకోసమే బొల్లారం ఆయుధాల అపహరణ!

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలనాలు వెలుగు చూశాయి. ఇప్పటికే కీలక సూత్రధారి మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్‌ను అరెస్టు చేసి కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు చోరీ వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని శనివారం మల్కాజిగిరి కమిషనరేట్, బొల్లారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
నిందితుల వద్ద నుంచి ఏకే 47 రైఫిళ్లు నాలుగు, ఐదు మ్యాగజైన్లు, ఇన్సాస్ రైఫిల్, ఇన్సాస్ మ్యాగజైన్లు మూ డు, 9ఎంఎం పిస్టళ్లు ఆరు, 9ఎంఎం పిస్టల్ మ్యాగజైన్లు 12, 6.35 బోర్ సివిల్ పిస్టల్ -ఒకటి, బైనాక్యులర్లు మూడు, 9ఎంఎం పిస్టల్ రౌండ్లు -1,156, ఏకే- 47 రౌండ్లు – 720, ఇన్సాస్ రౌండ్లు – 36, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 
పోలీస్ కమిషనర్ సుమతి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కంటోన్మెంట్‌లోని 20వ మద్రాస్ రెజిమెంట్ కొలో ఆయుధాలు చోరీకి గురయ్యాయని లెఫ్ట్‌నెంట్ కల్నాల్ మ యాంక్ గోవిత్రికర్ ఆగస్టు 31వ తేదీన బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన బొల్లారం పోలీసులు నాగర్‌కర్నూల్ జిల్లా పడారా  మండలం ఉడిమెళ్లి గ్రామానికి చెందిన మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేషన్ ను అరెస్టు చేశారు. తర్వాత కోర్టు అనుమతితో బొల్లారం పోలీసులు సెప్టెంబ్ 22న కస్టడీలోకి తీసుకుని విచారించారు.
కస్టడీ సమయంలో మల్లేష్ సంచలన విషయాలు చెప్పాడు. దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆర్మీ ఆయుధాలు చోరీ చేసేందుకు సహకరించిన అతడి స్నేహితులను అరెస్టు చేశారు. ఆయుధాలు చోరీ చేసిన మల్లేష్ తన బంధువు మల్లికార్జున్, స్నేహితుడు నిరంజన్‌తో కలిసి బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడాలని ప్లాన్ వేశాడు. 
 
ఆయుధాలతో బెదిరించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయాలని తన సోదరుడు, స్నేహితుడికి చెప్పాడు. దానికి అనుగుణంగా మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. దీనికి తనతో ఆర్మీలో పనిచేసిన శేషులు, వినోద్‌కుమార్, ప్రవీణ్‌లను సహకరించాలని కోరాడు. దానికి వారు అంగీకరించడంతో వారికి దశలవారీగా డబ్బులు ఇచ్చాడు. ఇలా చోరీ చేసిన ఆయుధాలను విక్రయించేందుకు కోల్‌కతాకు చెందిన బీర్బల్ షా, అవిడే అలియాస్ ఒబిని సంప్రదించాడు.
 
వీరు మల్లేష్ వద్ద ఆయుధాలు కొనుగోలు చేసి బంగ్లాదేశ్‌కు తరలించాలని ప్లాన్ వేశారు. ఆయుధాలు కొనుగోలు చేసేందుకు కొంత సమయం కావాలని చెప్పడంతో వారి ఫోన్ కోసం వేచి చూస్తుండగానే ఆయుధాల చోరీ విషయం బయటికి రావడంలో మల్లేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

About The Author