హైదరాబాద్‌లో వీసా గడువు ముగిసిన విదేశీయులపై స్పెషల్‌ డ్రైవ్‌

వీసా, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు ఉల్లంఘించి. గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే ఉంటున్న విదేశీయులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ చేపట్టారు. హైదరాబాద్‌ పోలీసుల స్పెషల్‌ బ్రాంచ్‌–ఫారినర్స్‌ మానిటరింగ్‌ సెల్‌, ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ), లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు సంయుక్తంగా నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు.

విదేశీయుల ధ్రువీకరణ వివరాలను పరిశీలించడం, వీసా నిబంధనల అమలును నిర్ధారించడం, అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఇప్పటివరకు 49 మంది విదేశీయులు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను ఉల్లంఘించి భారత్‌లో ఉంటున్నట్లు గుర్తించారు.

వారిని నిబంధనల ప్రకారం నిర్దేశిత హోల్డింగ్‌ సెంటర్లకు తరలించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే సంబంధిత అధికారుల సమన్వయంతో వారి స్వదేశాలకు డిపోర్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన వారి డిపోర్టేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. విదేశీయుల బసకు సంబంధించిన వివరాలను సమర్పించడం వసతి కల్పించే సంస్థలు, హోటళ్లు, లాడ్జీలు, ఇళ్ల యజమానులు తదితరులపై ఉన్న చట్టపరమైన బాధ్యతల్లో భాగమని పోలీసులు తెలిపారు. 

విదేశీయుల వీసా, పాస్‌పోర్టు వివరాలను సక్రమంగా పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని అధికారులకు అందించాలని సూచించారు. 2025లో అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ చట్టం, నిబంధనల ప్రకారం విదేశీయుల బసకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించాల్సిన నిబంధనలు ఉన్నాయి.

వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అనుమతి లేకుండా దేశంలో కొనసాగడం ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో సంబంధిత అధికారులు చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్‌లో విదేశీయుల ధ్రువీకరణ, వీసా నిబంధనల అమలుపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

About The Author