ఎదురవుతున్న వరుస ఎన్నికల పరాజయాలను తట్టుకోలేక, ప్రజాతీర్పును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. దేశంలో వరుసగా మూడు పర్యాయాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించి, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా ఆశీర్వదించడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోందని పేర్కొన్నారు.
ప్రధాని పీఠం కేవలం నెహ్రూ-గాంధీ కుటుంబానికి మాత్రమే సొంతమనే రాచరికపు అహంకారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఒక సామాన్య ‘చాయ్‌వాలా’ దేశ ప్రధాని పదవిని చేపట్టి విజయవంతంగా పరిపాలన సాగించడాన్ని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దేశంలో జరిగిన ఎన్నికలన్నీ బూటకమని, వాటిని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడటం భారత ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును వినియోగించుకున్న కోట్ల మంది పౌరుల విచక్షణను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి శక్తులు ఏకమై భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు), రాష్ట్రపతి కార్యాలయం, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వంటి రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఈ విధంగా వ్యవస్థలను బలహీనపరిచి దేశ సమగ్రతకు భంగం కలిగించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమే నిర్వహిస్తోందని, ఏవైనా అభ్యంతరాలుంటే వాటిపై ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయి విచారణ జరిపిన తర్వాత మాత్రమే ఓట్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఫామ్-7 సమర్పించినంత మాత్రాన ఓట్లు నేరుగా తొలగించబడవని, దొంగ ఓట్లు, నకిలీ ఓట్ల ఏరివేత కోసమే నిబంధనల ప్రకారం ఫామ్-7 విధానం ఉందని గుర్తు చేశారు. పైగా బీజేపీకి చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ-1, బీఎల్ఏ-2) ఎవరూ కూడా అటువంటి దరఖాస్తులు సమర్పించలేదని స్పష్టం చేశారు. విచారణ దశలోనే ఉన్న అంశంపై ఇప్పుడే ఓట్లు తొలగించేస్తున్నారంటూ కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం పూర్తిగా అభ్యంతరకరమని పేర్కొన్నారు.
ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలు, ఎస్ఐఆర్ ప్రక్రియలపై నిందలు వేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కేరళ వంటి రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రశంసించిన ఆ పార్టీ నేతలు, ఓడిపోయే చోట మాత్రం బురదజల్లుతున్నారని ఆక్షేపించారు.

More Stories
బంగ్లాదేశ్‌కు అక్రమ రవాణాకోసమే బొల్లారం ఆయుధాల అపహరణ!
హైదరాబాద్‌లో వీసా గడువు ముగిసిన విదేశీయులపై స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి సమన్వయంతో ప్రణాళికలు