గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కేవలం నినాదాలతో సాధ్యం కాదని, పాలనా యంత్రాంగం పూర్తి సమన్వయంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ ప్రణాళికలు రూపొందించి పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రివర్యులు జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా ‘దిశా’ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న కొద్దీ జిల్లాల సరిహద్దులు, కార్పొరేషన్లు వేరైనా నగరాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించి ప్రణాళికలు వేయాలని సూచించారు.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి తదితర జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ పరిధిలోని ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్లు, కమిషనర్లు తరచూ సంయుక్తంగా సమీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సమకూరే మొత్తం ఆదాయంలో 70 నుండి 80 శాతం రెవెన్యూ ఒక్క హైదరాబాద్ పరిసర జిల్లాల నుంచే వస్తోందని మంత్రి గుర్తుచేశారు.
అటువంటి మహానగరంలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించే జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు వంటి సంస్థలు నిధుల కొరతతో సతమతం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రొటీన్ బడ్జెట్ కేటాయింపులతో సరిపెట్టుకోకుండా, నగర ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ పెంచుకునేందుకు అధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మెట్రో, మూసీ సుందరీకరణ వంటి భారీ ప్రాజెక్టులు ప్రభుత్వ ఆలోచనల ప్రకారం జరుగుతున్నప్పటికీ, సామాన్య ప్రజలు నిత్యం ఎదుర్కొనే సివిక్ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం, అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ లీకేజీల నియంత్రణ, మురుగునీరు-వర్షపునీరు వేరుచేసే శాస్త్రీయ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాల్లో అలసత్వం వహించరాదని చెప్పారు.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి మారాలని, పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని సూచించారు. పేదలు నివసించే బస్తీలలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలను రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వ్యయంతో ఫ్లోరింగ్, టైల్స్, పెయింటింగ్, తాగునీటి వసతులు, పిల్లలకు దుప్పట్లు, యూనిఫాంలు వంటి సకల సదుపాయాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన అనుభవాన్ని ప్రస్తావించారు.
బస్తీల్లో ప్రాథమిక విద్య, వైద్యం, పారిశుధ్య వసతులను మెరుగుపరచడంలో అధికార యంత్రాంగం ఒక కుటుంబంలా బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటికి సరిపోయేలా రాష్ట్ర అధికారులు సరైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు, ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని కేంద్ర మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా అధికారులు నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు పంపితే, కేంద్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణకు నిధులు మంజూరు చేయించి తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి హైదరాబాద్‌ను ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.

More Stories
యుపిలో 23,000 మంది నేరస్తుల అరెస్టు, రూ. 15,233 కోట్ల ఆస్తుల జప్తు
ఫిబ్రవరి నాటికి 114 రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం!
రెండు పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్ పదవులను కోల్పోయిన మమత