తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పూల పండుగగా పిలువబడే ఈ వేడుకలను ప్రజలంతా సంతోషంగా జరుపుకునేలా అధికారికంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా సద్దుల బతుకమ్మ రోజైన అక్టోబర్ 18వ తేదీన హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలతో భారీ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అక్టోబర్ 18వ తేదీన సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరి ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. బతుకమ్మ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి పండగ శోభ తీసుకొచ్చేలా ప్రధాన కూడళ్లలో బతుకమ్మ నమూనాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
ముఖ్యమైన జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. బతుకమ్మ నిమజ్జనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు. ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే అవకాశం ఉన్నందున ఆ సమయంలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రత్యేక బారికేడింగ్, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బతుకమ్మ వేడుకల సమయంలో రహదారులపై రద్దీ పెరగకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలను అందుబాటులో ఉంచనున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ముఖ్యమైన ప్రదేశాల్లోనూ బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా తెలంగాణ పూల పండుగ విశిష్టతను రాష్ట్రవ్యాప్తంగా చాటేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక లోగోను రూపొందిస్తోంది. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగ ప్రత్యేకతతో పాటు డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 అంశాన్ని కూడా ఈ లోగోలో పొందుపరచనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు.

More Stories
హైదరాబాద్‌లో వీసా గడువు ముగిసిన విదేశీయులపై స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి సమన్వయంతో ప్రణాళికలు
విలువలతో కూడిన, నైపుణ్య ఆధారిత విద్యకు సమగ్ర మార్పులు