తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీల మధ్య పరస్పర అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునే ‘క్విడ్ ప్రో కో’ నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. సినిమా, టీవీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగత ప్రభుత్వ మంత్రులు, కుటుంబీకుల ఆస్తులపై వ్యాఖ్యలు చేశారని, దానికి ప్రతిగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అవినీతిపై ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీఆర్ఎస్ అవినీతి చిట్టా విప్పి అరెస్టులు చేస్తామని ప్రగల్భాలు పలికిందని, కానీ నేటికీ ఒక్క కేసులోనూ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమై లోపాయికారీ ఒప్పందాలతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులతో ఉక్కుపాదం మోపుతోందని రాంచందర్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో 317ను బీజేపీతో పాటు ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారని, దానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం తెచ్చిన జీవో 190ను సైతం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. జీవో 190 పరిధిలో దాదాపు 4000 మందికి ట్రాన్స్ఫర్లు/డిప్యుటేషన్లు రావాల్సి ఉండగా, కేవలం 100 నుంచి 200 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, నీళ్లు లేక, కరెంట్ రాక పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో బోరుబావుల్లో నీరులేక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని, జూరాలకు వెళ్తుంటే రైతులను, తమ పార్టీ నేతలను సైతం అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఖరీఫ్ సీజన్ లో రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని, రాబోయే రబీ పంటకు సిద్ధమవుతున్న అన్నదాతలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ఒక విడత ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుతో విసిగిపోయిన ప్రజలు రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని రాంచందర్ రావు పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ సినిమా సెల్ కో-కన్వీనర్, నటుడు వైభవ్ సూర్య ఆధ్వర్యంలో టీవీ ఆర్టిస్ట్, న్యాయవాది స్వర్ణలత, ప్రముఖ టీవీ నటుడు లక్ష్మణ్, సీనియర్ కెమెరామెన్లు సురేష్, మహేష్ లకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
More Stories
దిల్సుఖ్నగర్ ఆలయంలో అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి
ఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్‌ను తగలబెడతాం
ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేన్నట్లేనా?