ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేన్నట్లేనా?

ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన ఎన్నికల పిటిషన్‌పై డివిజన్ బెంచ్ తుది నిర్ణయం వెలువడే వరకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయబోమని గురువారం నివేదించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో పదో షెడ్యూలు ప్రకారం దా నం నాగేందర్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఏర్పడింది. 
 
అయితే, 2023 అ సెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పి.విజయారెడ్డి.. బిఆర్‌ఎస్ తరపున దానం ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దానం ఎన్నిక చెల్లదని ప్రకటించడంతోపాటు, తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆమె ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ ఎన్నికల పిటిషన్‌పై నిర్ణయం వెలువడకముందే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది.  ఈ కారణంగా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని, అలా జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విజయారెడ్డి అత్యవసరంగా లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వి. రామకృష్ణారెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. 
 
ఎన్నికల పిటిషన్ పెం డింగ్‌లో ఉన్నప్పుడు దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడినంత మాత్రాన ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఖాళీ అయిన స్థానంగా పరిగణించరాదని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 84, 98(సి), 101(బి) ప్రకారం ఎన్నికల పిటిషన్‌పై ఫలితం వెలువడే వరకు ఉప ఎన్నిక ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని పేర్కొన్నారు. 
 
కేంద్ర ఎన్నికల సంఘం తరపున స్పందించిన న్యాయవాది దానం నాగేందర్ ఎన్నికకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయబోమని చెప్పారు. ఎన్నికల పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ‘క్యాజువల్‌ వెకెన్సీ’గా పరిగణించడానికి వీల్లేదని, ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు.ఇసి ఇచ్చిన ఈ వివరణను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

About The Author