చైనా గగనతలం మీదుగా ప్రయాణికుల విమానాలకు అనుమతిపై ఏడాది నుంచి చర్చలు జరుగుతున్నట్టు వర్గాలు వెల్లడించాయి. ప్రత్యామ్నాయ మార్గం కోసం చైనాతో విదేశీ వ్యవహరాల శాఖ సంప్రదింపులు జరుపుతోందని వ్యాఖ్యానించాయి. సెప్టెంబరు 21 నుంచి గ్వాంగ్జూ- న్యూఢిల్లీ మధ్య విమాన సర్వీసులను పునరుద్దరించనున్నట్టు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ జిన్‌పింగ్ ఢిల్లీ పర్యటనకు ముందుకు ప్రకటించింది. ఈ మార్గంలో గత ఆరేళ్ల నుంచి సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
కరోనా, అనంతరం భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించే విస్తృత ప్రయత్నాల్లో ఇదీ ఓ భాగం. దక్షిణాసియాలోని ఎనిమిది మార్గాల్లో వారానికి 100కుపైగా విమానాలను నడిపే చైనా సదరన్ ఎయిర్‌లైన్స్.. చైనా, ఈ ప్రాంతం మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని తెలిపింది.
భారత్-చైనా మధ్య ఐదేళ్ల తర్వాత గత ఏడాది అక్టోబరులో విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కోల్‌కతా- గ్వాంగ్జౌ మధ్య.. ఆ తర్వాత నవంబర్‌లో ఢిల్లీ-గ్వాంగ్జౌ మార్గంలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఎయిరిండియా ఢిల్లీ-షాంఘై మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాయి. న్యూఢిల్లీ, బీజింగ్‌ల మధ్య విస్తృత దౌత్య సంబంధాల నేపథ్యంలో విమాన సర్వీసులను పునరుద్దరించారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 2025 నుంచి మన విమానాలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గం కీలకంగా మారింది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ దాయాదుల మధ్య జరిగిన సైనిక ఘర్షణకు దారితీసింది. దానితో ఏప్రిల్ 2025 నాటి పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్థాన్, భారత్ పరస్పరం ఒకదాని విమానయాన సంస్థలపై గగనతల ఆంక్షలను విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, రెండు వారాల కిందట భారత విమానాలపై తన ఆంక్షలను మరో నెలపాటు పాక్ పొడిగించింది.

More Stories
ఎల్ఈటి అగ్రశ్రేణి కమాండర్ ఫౌజీ మూసా కాల్చివేత
అసోం రైఫిల్స్ దళాలపై ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి
సీబీఎస్ఈ విద్యార్థులకు భాష మార్పులో వెసులుబాటు కల్పించాలి